బ్రెజిల్ దేశంలో ఓ నర్సు చేసిన పొరపాటుకు ఇద్దరు శిశువులు ఆస్పత్రి పాలయ్యారు. ఇద్దరు నవజాత శిశువులకు పొరపాటున నర్సు కరోనావైరస్ వ్యాక్సిన్ షాట్లు ఇచ్చింది. దీంతో ఇద్దరు శిశువు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చిందని బ్రెజిలియన్ మీడియా తెలిపింది. డిఫ్తీరియా, టెటానస్ (లాక్‌జా), పెర్టుసిస్ (కోరింత దగ్గు), హెపటైటిస్ బికి వ్యతిరేకంగా కలిపిన ఇమ్యునైజింగ్ ఏజెంట్ టీకాకు బదులుగా రెండు నెలల బాలిక, నాలుగు నెలల బాలుడికి కొవిడ్-19 కి వ్యతిరేకంగా ఇచ్చే ఫైజర్ టీకాను ఇచ్చింది.
ఫైజర్ టీకా వేసిన తర్వాత ఇద్దరు శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరు శిశువులకు వ్యాక్సిన్‌లు వేసిన నర్సును అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అలాగే నర్సుపై పరిపాలనాపరమైన విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. అనేక దేశాలలో 5 నుండి11 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ క్లియర్ చేయబడింది. బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్, అన్విసా, జూన్‌లో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు ఫైజర్/బయోఎన్‌టెక్ COVID-19 వ్యాక్సిన్‌ను ఆమోదించింది.