ఇటీవల చలి తీవ్రత పెరగడంతో పొగ మంచు కమ్మేస్తోంది. చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో ముందున్న వాహనాలు సైతం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనాలను తొలగించిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదం జరిగిన గంట తరువాత నాంచాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాదచారులు వెళ్లే మార్గంలో వెళ్లొద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలను ఓటర్ టేక్ చేసేందుకు ప్రయత్నించవద్దని, వాహనాల మధ్య దూరం పాటించాలని చెప్పారు.