బలూచిస్తాన్‌లోని డేరా అల్లాయార్ పట్టణంలో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులతో సహా కనీసం 17 మంది గాయపడ్డారని డాన్ న్యూస్ నివేదించింది. ఆదివారం గుర్తుతెలియని ద్విచక్రవాహనదారులు సుబత్‌పూర్ చౌక్ సమీపంలో హ్యాండ్ గ్రెనేడ్ విసిరారని.. అది పేలి ఇద్దరు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లతో సహా 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
"మేము తీవ్రంగా గాయపడిన వారిని లర్కానాకు తరలించాము" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గ్రెనేడ్ దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో, బలూచిస్థాన్ అసెంబ్లీ స్పీకర్ మీర్ జాన్ ముహమ్మద్ ఖాన్ జమాలీ ఘటనను ఖండిస్తూ.. దీనిని తీవ్రవాద చర్యగా అభివర్ణించారు. ఏది ఏమైనప్పటికీ.. గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వారు ఎప్పటికీ విజయం సాధించలేరని.. త్వరలో న్యాయస్థానానికి తీసుకురాబడతారని నొక్కి చెప్పారు. పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.