రష్యా.. 15 మంది పోలీసు అధికారులను హతమార్చిన ముష్కరులు

రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఆదివారం సాయుధ మిలిటెంట్‌లు విరుచుకుప‌డ్డారు.

By Medi Samrat  Published on  24 Jun 2024 10:49 AM IST
రష్యా.. 15 మంది పోలీసు అధికారులను హతమార్చిన ముష్కరులు

రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఆదివారం సాయుధ మిలిటెంట్‌లు విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 15 మందికి పైగా పోలీసు అధికారులు, ఓ మతగురువుతో సహా పలువురు పౌరులు సాయుధ మిలిటెంట్‌ల చేతిలో హతమయ్యారని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌ గవర్నర్ సెర్గీ మెలికోవ్ సోమవారం తెల్లవారుజామున వీడియో ప్రకటనలో తెలిపారు. ముష్కరులు రెండు నగరాల్లోని చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ఒక పోలీసు పోస్ట్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

సాయుధ తిరుగుబాటు చరిత్ర కలిగిన ముస్లింలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జరిగిన దాడులను రష్యా జాతీయ తీవ్రవాద వ్యతిరేక కమిటీ.. ఇవి తీవ్రవాద చర్యలుగా అభివర్ణించింది. సోమ, మంగళ, బుధవారాలను ఆ ప్రాంతంలో సంతాప దినాలుగా ప్రకటించారు. కాస్పియన్ సముద్ర శివారులో ఉన్న డెర్బెంట్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరం, చర్చిపై సాయుధ వ్యక్తుల బృందం కాల్పులు జరిపినట్లు డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రభుత్వ మీడియా ప్రకారం.. చర్చి, ప్రార్థనా మందిరం రెండూ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు ఏకకాలంలో డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలోని చర్చి,ట్రాఫిక్ పోలీసు పోస్ట్‌పై దాడి గురించి నివేదికలు వచ్చాయి. ఈ ప్రాంతంలో తీవ్రవాద వ్యతిరేక చర్యను అధికారులు ప్రకటించారు. దాడుల్లో ఎంతమంది తీవ్రవాదులు పాల్గొన్నారనేది స్పష్టంగా తెలియలేదని తెలిపారు. ఈ దాడులకు బాధ్యులమని ఏ ఉగ్ర‌వాద సంస్థ‌ ప్రకటించలేదు. దాడిపై అధికారులు క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో డాగేస్తానీ అధికారి కుమారుల ప్రమేయంపై అత‌డిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

మెలికోవ్ వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని పరిస్థితులు స్థానిక అధికారుల నియంత్రణలో ఉందని.. స్లీపింగ్ సెల్స్ బయటపడే వరకు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. దాడులు విదేశాల నుండి జ‌రిగి ఉండవచ్చని అనుమానం వ్య‌క్తం చేశాడు.

మార్చిలో మాస్కోలోని సబర్బన్‌లోని ఒక కచేరీ హాల్‌లో ముష్కరులు గుంపుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 145 మంది మరణించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది, అయితే రష్యా అధికారులు కూడా ఎటువంటి ఆధారాలు అందించకుండా దాడికి ఉక్రెయిన్‌కు లింక్ చేయాలని ప్రయత్నించారు. కైవ్ దీనిని తీవ్రంగా ఖండించింది.

Next Story