సెర్బియాలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం బెల్‌గ్రేడ్ ప్రాథమిక పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించారు. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయుడు కూడా గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుసుకోడానికి పాఠశాలకు చేరుకున్నారు. అనుమానితుడైన ఏడో తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు తన తండ్రి తుపాకీని తీసుకుని వచ్చి విద్యార్థులపైనా, పాఠశాల గార్డుపైనా అనేక రౌండ్లు కాల్పులు జరిపాడని స్థానిక మీడియా చెబుతోంది.
పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని పెట్రోలింగ్ వాహనాలను వెంటనే సంఘటనా స్థలానికి తీసుకుని వచ్చారు. అనుమానితుడైన మైనర్‌ను అరెస్టు చేశారు. "పాఠశాల నుండి పిల్లలు అరుస్తూ బయటకు పరిగెత్తడం నేను చూశాను. వెంటనే తల్లిదండ్రులు వచ్చారు, వారు భయంతో ఉన్నారు. తర్వాత నాకు మూడు షాట్లు వినిపించాయి" అని ఒక విద్యార్థి సెర్బియా స్టేట్ బ్రాడ్‌కాస్టర్ RTSకి చెప్పాడు. సెర్బియాలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరగడం చాలా అరుదు.