పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 11 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. రేషన్ పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా పలువురు స్పృహతప్పి పడిపోయారని పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ నివేదించింది.
నివేదికల ప్రకారం.. ఈ సంఘటన కరాచీలోని SITE (సింధ్ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఎస్టేట్) ప్రాంతంలో జరిగింది. ఈరోజు జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని జియో న్యూస్ నివేదించింది. స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో అధికసంఖ్యలో ప్రజలు రేషన్ సేకరించడానికి ఫ్యాక్టరీకి తరలివచ్చారు. కరాచీ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి ఘటనపై విచారణ ప్రారంభించారు.
గత వారం కూడా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పిండి పంపిణీ కార్యక్రమం సందర్భంగా చెలరేగిన తొక్కిసలాటలో నలుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.