అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్ర‌మాదం.. 10 మంది స‌జీవ‌ద‌హ‌నం

10 Killed in apartment fire in Xinjiang.ఓ అపార్ట్‌మెంట్ భ‌వ‌నంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2022 6:32 AM GMT
అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్ర‌మాదం.. 10 మంది స‌జీవ‌ద‌హ‌నం

ఓ అపార్ట్‌మెంట్ భ‌వ‌నంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మ‌రో 9 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న వాయువ్య చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఉరుంకిలో గురువారం రాత్రి అపార్ట్‌మెంట్‌లో మంట‌ల చెల‌రేగాయి. 15వ అంత‌స్తులో చెల‌రేగిన మంట‌లు క్ర‌మంగా పై అంత‌స్తుల‌కు వ్యాపించాయి. 17 అంత‌స్తు వ‌ర‌కు మంట‌లు వ్యాపించ‌గా 21వ అంత‌స్తు వ‌రకు పొగ‌లు వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. దాదాపు మూడు గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అప్ప‌టికే విష‌పూరిత పొగ‌, మంట‌ల వ‌ల్ల 10 మంది మృతి చెందారు. మ‌రో 9 మందికి తీవ్ర‌గాయాలు కాగా.. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెర‌గ‌డానికి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న జీరో కోవిడ్ పాల‌సీ ఆంక్ష‌లే కార‌ణ‌మ‌ని అపార్ట్‌మెంట్ వాసులు అంటున్నారు. కింది ఫ్లోర్ లాక్ చేసి ఉండ‌డంతో ప్ర‌మాదాన్ని గ‌మ‌నించినా బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌న్నారు. దీంతో చాలా మంది అపార్ట్‌మెంట్ టాప్ ఫ్లోర్‌కి వెళ్లార‌న్నారు. కొంద‌రు త‌మ ప్లాట్ల‌లోంచి కింద‌కు దూకేయ‌గా.. మ‌రికొంద‌రు ప‌క్క ప్లాట్‌ల‌లోకి వెళ్లిన‌ట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.15వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లోని ఒక బెడ్‌రూమ్‌లోని పవర్ స్ట్రిప్ నుండి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

సెంట్రల్ చైనాలోని ఒక పారిశ్రామిక ట్రేడింగ్ కంపెనీలో సంభవించిన అగ్నిప్ర‌మాదంలో 38 మ‌ర‌ణించిన కొద్ది రోజుల్లోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

Next Story