నారాయణ, శ్రీచైతన్య కళాశాలలకు షాకిచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. గుర్తింపు రద్దు
By సుభాష్ Published on 17 April 2020 10:26 PM ISTనారాయణ, శ్రీచైతన్య జూనియర్ కళాశాలలకు తెలంగాణ ఇంటర్ బోర్డు దిమ్మదిరిగే షాకిచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 68 కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కళాశాలలకు నోటిసులు జారీ చేసింది. రద్దు చేసిన 68 కళాశాలల్లో 26 నారాయణ కళాశాలలు, 18శ్రీ చైతన్య కళాశాలలున్నాయి.
అయితే గతంలో శ్రీచైతన్య, నారాయణ కళాశాలల్లో అక్రమాలు జరిగాయని, విచారణ చేపట్టి గుర్తింపును సైతం రద్దు చేయాలని సామాజిక కార్యకర్త రాజేష్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై గతంలో రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టి గుర్తింపు లేని కాలేజీలపై నివేదిక అందించాలని తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది. మార్చి 4 నుంచి ఇంటర్ బోర్డు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో కళాశాలల మూసివేత విద్యార్థులపై ప్రభావం పడుతుందని, అందుకే పరీక్షలు ముగిసిన అనంతరం గుర్తింపు లేని, రూల్స్ పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని గతంలో తెలంగాణ ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. దీంతో ఏప్రిల్ 3 వరకు తుది నివేదిక అందించాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశం మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.