ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా.. జర జాగ్రత్త..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2020 1:46 PM GMT
ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా.. జర జాగ్రత్త..!

సామాజిక మాధ్యమాలపై హ్యాకర్ల కన్ను ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఏ వెబ్ సైట్ ను హ్యాక్ చేద్దామా అన్నట్లు ఉంటారు. సాధారణంగా బగ్స్ ను సోషల్ మీడియాలోకి వదిలేసి.. వాటి మీద క్లిక్ చేస్తే చాలు డేటాను దొంగిలించే విధంగా ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పలు సోషల్ మీడియా యూజర్లు ఈ బగ్స్ బారిన పడి సర్వం కోల్పోయారు.

సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వ్యక్తిగత వివరాలతో కూడిన డేటాను కొట్టేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త బగ్ ప్రవేశించింది. అది యూజర్లకు ఎంతో చేటు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా ప్రకారం.. ఈ బగ్ సాయంతో ప్రపంచంలో ఎక్కడ్నించి అయినా ఇన్ స్టాగ్రామ్ లోని అకౌంట్లలో అనుమతి లేకుండా ప్రవేశించవచ్చట. నెటిజన్ల పర్సనల్ మెసేజ్ లు చదవడంతో పాటు, యూజర్ల టైమ్ లైన్ లో ఏదైనా పోస్టు చేసే అవకాశం ఉంది. వారి కాల్ లిస్టు, కెమెరా, లొకేషన్ సమాచారం అన్నీ ఈ బగ్ అధీనంలోకి వెళ్లనున్నాయి.

హ్యాకర్లు ముందుగా జేపీఈజీ ఫార్మాట్ లో ఉన్న ఓ ఇమేజ్ పంపుతారు. ఆ ఇమేజ్ ను ఎవరైనా డౌన్ లోడ్ చేసుకున్నారంటే బగ్ ఎంట్రీ ఇచ్చెసినట్లే..! ఈ బగ్ ను సైబర్ నిపుణులు ముందే గుర్తించడంతో ఇంస్టాగ్రామ్ యూజర్లకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ విషయమై సైబర్ నిపుణులు ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్ బుక్ ను అప్రమత్తం చేశారు. ఫేస్ బుక్ బగ్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంది.

Next Story