Fact Check : రామ మందిర నిర్మాణంపై స్పెయిన్ లో అంత సందడి చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
రామ మందిర నిర్మాణం కోసం హిందువులు ఎదురుచూస్తూ ఉన్నారు. కోట్లాది మంది కలలకు ప్రతీకగా భారీ రామాలయ నిర్మాణానికి కీలకమైన తొలి అడుగు కొద్ది రోజుల్లో పడనుంది. ఆగస్టు ఐదో తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12-15 గంటల 15 సెకన్ల సమయంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. భూమిపూజకు కేవలం 200 మంది మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. శంకుస్థాపనకు హాజరయ్యే ప్రముఖుల్లో ప్రతి యాభై మందికి ఒక బ్లాక్ లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం నాలుగు బ్లాకుల్లో ప్రముఖులు ఆసీనులవుతారు.
రామ మందిరానికి భూమి పూజ జరుగుతూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆనందంతో ఉన్నారు. @RenukaJain6 అనే ట్విట్టర్ యూజర్ రామ మందిరం నిర్మించబోతున్నారనే ఆనందంలో స్పెయిన్ లో పెద్ద ఎత్తున మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారని వీడియోను పోస్టు చేశారు.
అలాంటి వీడియోను ఫేస్ బుక్ లో కూడా పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
రామ మందిరం నిర్మాణాన్ని స్వాగతిస్తూ స్పెయిన్ లో ఇలా భారతీయులు సందడి చేశారన్నది 'అబద్ధం'.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా “Dhol Tasha on the streets of Spain”, “Swargandhar’s International Tour to Spain” అంటూ రిజల్ట్స్ చూపించాయి.
అప్పుడు “Dhol Tasha”, “Spain”, “Swargandhar” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి యూట్యూబ్ లో వీడియోలను వెతకగా Swargandhar Dhol Tasha Pathak అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను చూడొచ్చు. 2018 లో స్వర్గాధర్ ట్రూపు స్పెయిన్ కు వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న ఘటన ఇది.
ఢోల్ తాషా పాఠక్ అన్నది మహారాష్ట్రలో బాగా ప్రాచుర్యం పొందినది. మరాఠా సంగీత వాయిద్యాలను ఉపయోగించి అద్భుతంగా సంగీతం అందిస్తారు. పలు పర్వదినాలలో వీరు చేసే సందడి అంతా ఇంతా కాదు. స్వర్గంధర్ అన్నది మహిళలలో కూడుకున్న బృందం. వీరు మనసు పెట్టి వాయించాలే కానీ ఎవరైనా ఆడాల్సిందే అని చెబుతూ ఉంటారు.
రామ మందిరం నిర్మాణాన్ని స్వాగతిస్తూ స్పెయిన్ లో ఇలా భారతీయులు సందడి చేశారంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో 2018లో తీసినది.