అన్ని అధికారాలు ఇస్తున్నాం.. చైనాకు బుద్ధి చెప్పండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2020 9:21 PM IST
అన్ని అధికారాలు ఇస్తున్నాం.. చైనాకు బుద్ధి చెప్పండి..!

చైనాకు చెందిన సైనికులు ఎల్.ఏ.సి. వద్ద అతిగా ప్రవర్తిస్తే తప్పకుండా బుద్ధి చెప్పండి అని కేంద్రం భారత సైనికులకు సర్వ అధికారాలను ఇచ్చింది. భారత్-చైనా మధ్య ఉన్న 3500 కిలోమీటర్ల నియంత్రణ రేఖ వెంబడి ప్రస్తుతం ఎంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం పలు ప్రాంతాల్లో అలర్ట్ గా ఉంది. చైనా మరోసారి తోకజాడిస్తే ధీటుగా బదులివ్వాలని సైన్యానికి భారత ప్రభుత్వం అన్ని అధికారాలను ఇచ్చింది.

డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ టాప్ మిలిటరీ కమాండర్లతో హై-లెవెల్ మీటింగ్ ను నిర్వహించారు. తూర్పు లడఖ్ లో చోటు చేసుకున్న ఘటనల గురించి చర్చించడానికి ఏర్పాటు చేసిన మీటింగ్ కు ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ ఛీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే, నేవీ ఛీఫ్ అడ్మైరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్కే బడోరియా హాజరు అయ్యారు.

రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులను ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. ఎయిర్ స్పేస్, సీ లేన్స్ లో కూడా గస్తీని ముమ్మరం చేయాలని అన్నారు. చైనా తీరుపై కఠినంగా ప్రవర్తించాలని.. చైనా ఆర్మీ ఏదైనా ఆకతాయి పనులు చేస్తే ధీటుగా బదులు ఇవ్వాలని చెప్పారు. ఈ విషయంలో సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.

తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాల్లో చైనా ఎలాంటి దుస్సాహసం చేసినా తగిన సమాధానం ఇవ్వడానికి భారత దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. మరణించిన చైనా సైనికుల సంఖ్య కూడా అధికంగా ఉందని తెలుస్తోంది. ఆ దేశ సైనికుల మరణాలపై మాట్లాడడానికి చైనాకు చెందిన ఏ అధికారి కూడా ముందుకు రావడం లేదు.

ఇదిలావుంటే.. రష్యాలో నిర్వహించే విక్టరీ డే పరేడ్‌ కు హాజరు కావడానికి మంత్రి రాజ్‌నాథ్ సోమవారం బయలుదేరి వెళతారు. అక్కడ జూన్ 24న జరిగే పరేడ్‌ లో పాల్గొననున్నారు.

Next Story