భారతదేశంలో మైనారిటీలకు రక్షణ కరువైందంటూ యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) సంస్థ తెలిపింది. ఇది అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. భారత్‌లో మైనారిటీల పరిస్థితి దిగజారిందని, వారి స్వేచ్ఛకి భంగం కలిగిందని తెలిపింది. మైనారిటీల విషయంలో ప్రస్తుతం భారత్ లో తీసుకునే చర్యలు దారుణంగా ఉంటున్నాయని, మైనారిటీలు ఇండియాలో ఇబ్బందులు పడుతున్నారని అంది.

యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ నివేదికలో భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్‌, ఉత్తర కొరియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, తుర్క్‌మెనిస్తాన్‌, తజికిస్తాన్‌, నైజీరియా, రష్యా, సిరియా, వియత్నాంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. 2004 తర్వాత భారత్ మరోసారి ఈ లిస్టులోకి వచ్చిందని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ తెలిపింది. సీఏఏ చట్టం వల్ల భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. భారత్‌ను ఆందోళనకర దేశాల జాబితాలోకి చేర్చాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సిఫారసు చేసిందీ సంస్థ.

ఢిల్లీలో సీఏఏకు మద్దతుగా, వ్యతిరేకంగా జరిగిన దాడులను కూడా నివేదికలో పొందుపరిచింది. భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం లాంటి ఘటనలను కారణంగా చూపిస్తూ భారత్‌ను ఆందోళనకర దేశాల జాబితాలోకి చేర్చాలని యూఎస్‌సీఐఆర్ఎఫ్ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.

బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతస్వేచ్చను హరిస్తోందని.. ముఖ్యంగా ఈ ప్రభావం ముస్లింలపైనే ఉంటోందని తెలిపింది. భారత ప్రభుత్వ ఏజెన్సీలు, అధికారులకు చెందిన ఆస్తులను ఫ్రీజ్ చేసేలా ఆంక్షలు తీసుకొచ్చి వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ను కోరింది.

ఈ నివేదికపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అవాస్తవమైన నివేదికలు ఇవ్వడం సరికాదని.. హద్దుల్లో ఉండాలని, తమ దేశంలో మైనారిటీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకోకుండా అవాస్తవాలను ప్రచురించడం సరికాదని భారత్ తెలిపింది. యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం నివేదిక అర్థరహితమని, ఇంతకుముందు కూడా భారత్‌పై పక్షపాత, ఉద్దేశపూర్వకంగా వైఖరి ప్రదర్శించిందని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ఆరోపణల విషయంలో సొంత కమిషనర్ల మద్దతునే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కూడగట్టలేకపోయిందని శ్రీవాస్తవ అన్నారు. తొమ్మిది మంది కమిషనర్లలో భారత్‌పై ఆరోపణలను ఇద్దరు ఏకీభవించలేదని స్పష్టం చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.