అమెరికాలో 50వేలు.. భారత్‌లో 19వేలు
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 10:49 AM ISTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,08,03,559 కేసులు నమోదు కాగా.. 5,18,968 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 64,57,985 మంది కోలుకోగా.. 43,45,614 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో ఒక్క రోజే 50వేల కేసులు..
అమెరికాలో ఈ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 52,898 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 27,79,953 కి చేరింది. ఇక ఈ మహమ్మారి భారీన పడి 1,30,798కి చేరింది. అక్కడ నమోదు అయిన కేసుల్లో 11,64,680 కోలుకుని డిశ్చార్జి కాగా.. 14,84,475 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికా తరువాత బ్రెజిల్‌లో ఈ మహమ్మారి ఉదృతి ఎక్కువగా ఉంది. నిన్న 45వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 14,53,369 కి చేరింది.
భారత్‌లో 6లక్షలు దాటిన కరోనా కేసులు..
భారత్‌లో కూడా ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా నిత్యం 18వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 19,148 కేసులు నమోదు కాగా.. 434 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటితో కలిపి ఇప్పటి వరకు భారత్‌లో 6,04.641 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి మరణించిన వారి సంఖ్య 17,834కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,59,860 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,26,947 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. గురువారం నాటికి అక్కడ లక్షా ఎనభైవేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8053 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర అనంతరం తమిళనాడులో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడ 94వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 89వేల కేసులు, గుజరాత్‌లో 33వేల కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది.