డీఆర్‌డీఓ మరో సక్సెస్.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన నాలుగో దేశం మనదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 2:30 PM GMT
డీఆర్‌డీఓ మరో సక్సెస్.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన నాలుగో దేశం మనదే..!

ఒరిస్సా తీరంలో సోమవారం నాడు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ వెహికిల్‌ని విజయవంతంగా పరీక్షించింది. వాతావరణంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ధ్వని వేగం కంటే ఆరు రెట్లు వేగంతో పనిచేయనున్న హైపర్ సోనిక్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజన్‌ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ అరుదైన ఘనత సాధించిన దేశాల జాబితాలో భారత్‌ నాలుగో దేశంగా గుర్తింపు పొందింది. హైపర్ సైనిక్ టెక్నాలజీ టెస్ట్ విజయవంతంతోమరిన్ని క్లిష్టమైన సమస్యలకు సమాధానాలు సులువుగా దొరికే అవకాశం ఉంది.

హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్స్‌ట్రేటర్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజిన్‌తో రూపొందించడంతో 20 సెకన్లలో 20 మైళ్ల వేగాన్ని కవర్ చేయగల సామర్ధ్యం ఈ జెట్ ఫ్లయిట్‌కు ఉంది. వీటిని బహుళ పౌర అవసరాలకు కూడా వినియోగించడమే కాకుండా .. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను సైతం ప్రయోగించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. సుదూర లక్ష్యాలను చేధించే క్షిపణులను కూడా ప్రయోగించే సామర్థ్యం వీటికి ఉందని రక్షణశాఖ చెబుతోంది.

ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీఓ ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ జెట్ ఫ్లయిట్‌ను రూపొందిండంతో రక్షణరంగంలో ఆత్మనిర్భర్ భారత్‌ దిశగా అడుగులు వేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ టెక్నాలజీ నెక్ట్స్ జనరేషన్ హైపర్ సోనిక్ వాహనాలకు బాట వేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. “సశక్త్ భారత్” మరియు “ఆత్మనిర్భర్ భారత్” వైపు అడుగులు వేయడంలో ఇది ఓ ముఖ్యమైన మైలురాయని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసిన శాస్త్రవేత్తలతో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా మాట్లాడి అభినందించారు.

డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు సంస్థ చైర్మన్‌ సతీష్ రెడ్డి అభినందనలు తెలిపారు. మిషన్‌కు సంబంధించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర సిబ్బంది దృఢ సంకల్పం, విశ్వాసంతో వారు చేసిన ప్రయత్నాలను సతీష్ రెడ్డి కొనియాడారు.

Next Story