కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. మన దేశం మొత్తాన్నీ లాక్‌డౌన్‌లోకి నెట్టేసింది. మార్చిలో లాక్‌డౌన్ మొదలు కాకముందు నుంచే అన్ని స్కూళ్లు నిరవధికంగా మూతపడ్డాయి. కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఎప్పటినుంచి మొదలవుతుందనే విషయంపైనా స్పష్టత లేదు.
ప్రస్తుతం దేశంలో నాలుగో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ ఈ దశతో ముగుస్తుందా లేదంటే మళ్లీ పొడిగిస్తారా ? అన్న విషయంలోనూ దేశమంతటా సందిగ్ధం నెలకొంది. అయితే.. ఇదే సమయంలో ఓవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ టివి ఛానెల్‌లో ప్రసారమైనట్లుగా బ్రేకింగ్‌న్యూస్ ప్లేట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
పాఠశాలలు, కళాశాలలు తెరవడానికి అన్ని పాఠశాలలకు హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇండియా న్యూస్' అనే న్యూస్ ఛానల్ లోగోతో.. ఆ బ్రేకింగ్ ప్లేట్‌ను పలువురు షేర్ చేసుకుంటున్నారు. ఆ బ్రేకింగ్ ప్లేట్‌లో 'హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని పాఠశాలలు తెరవడానికి అనుమతి ఇచ్చింది' అని హిందీలో పేర్కొన్నారు.
అయితే.. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న ఇమేజ్‌ను పోస్ట్ చేసి.. దాని కింద వివరణ ఇచ్చింది. దేశంలో పాఠశాలలను తెరిచేందుకు హోం మంత్రిత్వశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు తెరుచుకోకుండా ప్రస్తుతం నిషేధం కొనసాగుతోందని హోం మంత్రిత్వశాఖ స్పష్టత ఇచ్చింది.
తల్లిదండ్రులను, విద్యార్థులను ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేదిగా ఉంది. సోషల్ మీడియాలో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అర్థమవుతోంది. కాబట్టి హోం మంత్రిత్వశాఖ అధికారికంగా చెప్పిన మేరకు ఇప్పట్లో పాఠశాలలేవీ తెరుచుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పాఠశాలలు తెరవాలా, లేదా అన్న దానిపై అధికారికంగా ప్రకటన వస్తుంది.
ప్రచారం : దేశంలోని అన్ని స్కూళ్లు తెరవడానికి హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది.
వాస్తవం : అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, ఇది తప్పుడు వార్త అని హోం మంత్రిత్వశాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.
కంక్లూజన్ : వాస్తవానికి ప్రస్తుతం నాలుగో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో అసలు వ్యాపార, వాణిజ్య సంస్థలకే పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వలేదు. ఈ సమయంలో స్కూళ్లు తెరిచేందుకు హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పోకిరీ చేష్టలుగా అర్థమవుతోంది.