తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు..!

By సుభాష్  Published on  7 April 2020 9:03 AM GMT
తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు..!

కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజులు గడిచిన కొద్ది కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. కేంద్ర పిలుపుతో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారనుకుంటే నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటనతో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న కరోనా కేసులు ..ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల పరిస్థితి అంతే మర్కజ్‌ ప్రార్థలన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి.

ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా.. లేదా అన్నది ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రోజువారీ కూలీల నుంచి వ్యాపారస్థుల వరకు భారీ ఎత్తున నష్టపోతున్నారు. తాజాగా నిన్నముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను మరి కొన్ని రోజులు పొడిగిస్తే బాగుంటుందని, అందుకు కొన్ని సంస్థలు కూడా జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని సూచిస్తున్నాయని, ఈ విషయమై ప్రధాని మోదీతో కూడా చెప్పానని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ పొడిగించక తప్పదని, లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలున్నాయని, అందుకే లాక్‌డౌన్‌ను పొడిగించాలని మోదీకి నివేదించినట్లు తెలిపారు. ముందుగా ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్ ముగిసిపోతుందని అనుకున్న సమయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయని అన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా కేసీఆర్‌ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు కూడా మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగింపు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

దీనిపై ఉత్తరప్రదేశ్‌ యోగి సరర్కార్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చేసింది. కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలంటే మరి కొన్ని రోజులు లాక్‌డౌన్‌ తప్పనిసరి అని యూపీ సర్కార్‌ చెబుతోంది. ఇక రాజస్థాన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో మరో వైపు చూస్తే మహారాష్ట్రలో దారుణంగా తయారైంది. దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులున్న రాష్ట్రం ఇదే.

కరోనా లేని ప్రాంతాల్లో ఆంక్షలు తొలగిస్తారా..?

ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై దేశవ్యాప్తంగా పరిస్థితులపై మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కేంద్రమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 14 తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అయితే కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలను రెడ్‌ జోన్లుగా గుర్తించి, మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు తొలగిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశంపై ప్రధాన మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే లాక్‌డౌన్‌ ఎత్తివేతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story
Share it