ఉమ్మడి జిల్లాను వెంటాడుతున్న కరోనా.. పెరుగుతున్న కేసులు

By సుభాష్  Published on  7 April 2020 5:42 AM GMT
ఉమ్మడి జిల్లాను వెంటాడుతున్న కరోనా.. పెరుగుతున్న కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలకు తెలంగాణ, ఏపీల నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లడంతో కరోనా కేసులు పెరగడానికి ఒక కారణంగా మారింది. ఇక తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో మరో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పరీక్షల నిమిత్తం 41 మంది శాంపిళ్లను పంపించారు. అందులో 20 మంది రిపోర్టులు రాగా, 10 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

ఇక కామారెడ్డి జిల్లాలో కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకూ 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లిలో ఒక పాజిటివ్‌ నమోదు కాగా, ఒక్క బాన్సువాడలోనే 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 37 కరోనా మహ్మారి బారిన పడ్డారంటే పరిస్థితులు ఏ మేరకు దాటిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ఉమ్మడి జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనుమానితులను క్వారంటైన్‌కు తరలించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో నమోదైన కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివే ఉన్నాయి.

Next Story