లాక్‌డౌన్‌ ఎత్తివేతపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏమంటున్నారంటే..

By సుభాష్  Published on  7 April 2020 3:13 AM GMT
లాక్‌డౌన్‌ ఎత్తివేతపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏమంటున్నారంటే..

కోవిండ్-19 దేశ వ్యాప్తంగా బుసలుకొడుతోంది. ఈ మహమ్మారి దేశంలో వ్యాపించిన నాటి నుంచి కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4వేల వరకు ఉండగా, మరణాల సంఖ్య వందకుపైగానే నమోదయ్యాయి. ఇక కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలవుతోంది. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా తమ తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

కేంద్రం అప్రమత్తంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెద్దగా లేకపోగా, ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కాజ్‌ ప్రార్థనల నేపథ్యంలో మరోసారి కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. కరోనాను అదుపులో ఉంచిన దేశం.. కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన పడిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను మరింత అప్రమత్తం చేసింది. అయితే దేశంలో 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ గడువు ఏప్రిల్‌ 14తో ముగియనుంది. కేసుల సంఖ్య పెరిగిపోవడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా.. లేదా అన్నది అనుమానం అందరిలో తలెత్తుతోంది.

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డిని ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఏప్రిల్‌ 14తో ముగియనున్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా..? లేదా.. అన్న ప్రశ్నకు మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అనుకుంటుంది తప్ప.. పెంచాలని అనుకోవడం లేదని, ఎందుకంటే లాక్‌డౌన్‌ కారణంగా సామాన్యుల నుంచి వ్యాపారస్తుల వరకు తీవ్ర ఇబ్బందులకు గువుతున్నారని, దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ అమలు చేసిందని, ఇక తర్వాత పొడిగింపుపై అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటి వరకూ లాక్‌డౌన్‌ను పొడిగింపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

కరోనాపై దేశం ముందుగానే అప్రమత్తమై కేసుల సంఖ్య పెరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టిందని, నిజాముద్దీన్‌ మర్కజ్‌ కారణంగా దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయని అన్నారు. గతంలో విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్‌ రాగా, మర్కజ్‌ కారణంగా కాంటాక్ట్‌ కేసుల సంఖ్య పెరిగిపోయాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను జూన్‌ 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీకి నివేదించారని, ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే ప్రధాని లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.

Next Story