కరోనాపై చేస్తున్న‌ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేర‌కు ఈ రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న‌ ప్రజలంతా ఒకే తాటిపై నిలిచి కరోనా బాధితులకు మేమున్నామంటూ దిగ్విజయంగా దీపాలు, టార్చ్‌లైట్లు, మొబైల్‌ఫోన్ ప్లాష్‌ల‌తో తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఇక‌ ప్రధాని నరేంద్ర మోదీ కూడా 9గంట‌ల‌కు జ్యోతి ప్రజ్వలన చేసి కరోనాను తరిమేద్దాం అంటూ సంఘీభావం ప్రకటించారు. అంత‌కుముందు మోదీ పిలుపు మేరకు.. స‌మ‌యం రాత్రి 9గంటలు కాగానే ప్రజలంతా తమ ఇళ్లలోని లైట్లు ఆర్పి.. కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, మొబైల్‌ ఫోన్‌ లైట్లు, ప్రమిదలతో తమ‌ ఐక్యత భావాన్ని చాటారు. దేశ ప్రధాని నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార వేత్త‌లు, సీనీ ప్ర‌ముఖులు నుంచి ఆటగాళ్ల దాకా అందరూ ఈ దియా జలావొలో పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలంతా తమ ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆర్పివేసి కరోనాపై చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవ్వొత్తిని వెలిగించి తన మద్దతు ప్రకటించ‌గా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులతో కలిసి ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించారు. అలాగే.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ఏపీ గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌లు కొవ్వొత్తితో కరోనాపై పోరాటానికి తమ‌ వంతుగా సంఘీభావం తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.