పులులను వీటి కోసం కూడా వాడేస్తున్నారు.. షాకింగ్ విషయాలు బయటకు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2020 7:33 AM GMTడెహ్రాడూన్: టైగర్ వైన్ కాస్ట్ ఎంతో తెలుసా..? 1000 డాలర్లు. టైగర్ కేక్ ను కూడా తయారు చేస్తున్నారు.. చాకొలేట్ బార్లను ఎలా అమ్ముతారో వీటిని కూడా అలాగే అమ్ముతూ ఉన్నారంటే చాలా మందికి తెలియదేమో..! ఒకప్పుడు వైద్య సంబంధిత అంశాల కోసం పులులను వేటాడి.. వాటి అవయవాలను బ్లాక్ మార్కెట్ కు తరలించే వారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.. లగ్జరీ వస్తువులను పులుల కళేబరాలతో తయారు చేయడం మొదలుపెట్టారు. పులులకు నిలయమైన భారత్ కూడా వీటిని సప్లై చేస్తున్న రెండో దేశంగా నిలవడం అధికారులను కలవరపెడుతోంది.
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 2007 నుండి 2018 మధ్య పట్టుబడ్డ జంతువుల అవయవాలలో మూడింట రెండు వంతులు పులుల ఎముకలు ఉన్నాయట. థాయ్ ల్యాండ్, భారత్ నుండే ఇవి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. థాయ్ ల్యాండ్ లో పులులను వీటి కోసమే పెంచుతున్నారని కూడా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ చెబుతోంది. 155 కేసులు పులుల అవయవాలు, కళేబరాలకు సంబంధించిన కేసులు నమోదవ్వగా అందులో 29 శాతం చైనాకు చెందినవి, 18 శాతం భారత్ కు చెందినవి తాజా నివేదిక చెబుతోంది.
పులుల ఎముకలలో ఔషధ గుణాలు ఉన్నాయని తెలియడంతో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లో వీటిని అమ్మడం మొదలైంది. ఆసియాకు చెందిన సాంప్రదాయ ఔషధాలలో పులుల ఎముకలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పులుల వైన్ ను తయారు చేస్తున్నారు.. అలాగే టైగర్ కేక్ ను తయారుచేయడం లేదా.. వాటిని ఉపయోగించి పిల్స్ ను తయారుచేయడం జరుగుతూ ఉందట..! '1986 లో మొదటి సారి టైగర్ బోన్ కేసు నమోదయ్యింది. దుడ్వా టైగర్ రిజర్వ్ లో ఇది చోటుచేసుకుంది. 1990 లలో ఈ అక్రమ రవాణా చైనా, భారత్ లో ఎక్కువైందని' బెలిందా రైట్ తెలిపారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు బెలిందా..!
ఈ అక్రమ రవాణా ముఖ్యంగా రెండు మార్గాల ద్వారా జరుగుతోంది. ట్రాన్స్ హిమాలయన్(భారత్-నేపాల్-టిబెట్), మెకాంగ్ డెల్టా(ఆగ్నేయాసియా దేశాల)ల మీదుగా పులుల ఎముకలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. దక్షిణాసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా మారాయి. అక్కడ పట్టుబడుతున్న కేసుల ఆధారంగానే ఈ విషయాన్ని గుర్తించవచ్చు అని చెబుతున్నారు. భారత్-నేపాల్ మీదుగా చైనాకు చేరుతున్నాయి.. లేదా మయన్మార్ కు చేరుకుంటున్నాయని అంటున్నారు. ఈ మార్కెట్లు ముఖ్యంగా చైనా, వియాత్నం, థాయ్ ల్యాండ్ లలో ఉంటాయి.
పులుల నుండి తయారు చేసే వస్తువులలో వివిధ మార్పులు కోరుకుంటూ ఉన్నారు వినియోగదారులు. ఒకప్పుడు పులుల మాంసాన్ని కోరుకునే వారు కాస్తా ఇప్పుడు పులుల వైన్ ను కోరుకుంటున్నారని తాజా రిపోర్టులో తేలింది. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో పులులతో చేసిన లగ్జరీ వస్తువులను కోరుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. ఏవి పడితే ఆ జంతువులతో తయారు చేసిన వస్తువులను వాడడం వలన ఇప్పటికే చాలా రోగాలను మనుషులు కొనితెచ్చుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే నిపుణులు చెబుతున్నారు.