అత్యధిక సీసీటీవీల సర్వైలెన్స్‌లో ప్రపంచంలోనే టాప్-20లో చేరిన హైదరాబాద్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 July 2020 7:12 AM GMTహైదరాబాద్: ప్రతి 1000 మంది జనాభాకు 30 మంది కెమెరాల నిఘా నీడలో ఉన్నారట. ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీల సర్వైలెన్స్ కలిగిన నగరాల్లో హైదరాబాద్ టాప్-20లో చోటు సంపాదించుకుంది. హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన నగరాలు కాకుండా టాప్-20లో చోటు సంపాదించుకున్న నగరాలు లండన్, హైదరాబాద్ మాత్రమేనని తెలుస్తోంది. Comparitech సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మొత్తం 150 నగరాల్లోని జనాభా, సీసీటీవీల సంఖ్య, ప్రతి వెయ్యి మందికి ఎన్ని కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్న దానిపై రీసెర్చ్ నిర్వహించారు. ప్రభుత్వాల నివేదికలు, పోలీస్ వెబ్‌సైట్లు, పత్రికల్లో వచ్చిన కథనాలు, రిపోర్ట్‌లు, ఇతర రూపాల్లో డేటాను సేకరించామని కంపారిటెక్ సంస్థ తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా 770 మిలియన్ల సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 54 శాతం సీసీటీవీ కెమెరాలు చైనాలోనే ఉన్నాయి. 2021కల్లా ప్రపంచంలోని సీసీటీవీలు వంద కోట్లకు చేరుకుంటుండగా అందులో 54 కోట్లు చైనాలోనే ఉంటాయని అంచనా వేస్తోంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఉన్న ముంబై టాప్ 20లో చోటు సంపాదించుకోలేకపోయింది. ఢిల్లీ 33వ స్థానంలో ఉండగా.. చెన్నై 21వ స్థానంలో నిలిచింది.
తెలంగాణ పోలీస్ ఐటీ సెల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 'మూడు లక్షల కెమెరాలు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశారు. రాచకొండ, సైబరాబాద్ పరిధిలో లక్ష సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్ అర్బన్ సిటీలో మొత్తం 4.5 లక్షల కెమెరాలు ఉన్నాయి. 80 లక్షల నుండి కోటి వరకూ జనాభా ఉన్న నగరంలో మూడు నుండి నాలుగున్నర లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే అధికంగానే ఉన్నాయని భావించవచ్చు' అని తెలిపారు. 60 నుండి 70 వరకూ పోలీసు నెట్ వర్క్స్ కు కనెక్ట్ అయ్యి ఉండగా.. మిగిలినవి ఇతర వాటికి కనెక్ట్ అయ్యాయి.. పోలీసుల అవసరాన్ని బట్టి డేటాను సేకరిస్తూ ఉంటారు అని ఆయన తెలిపారు. కెమెరాలన్నవి కేవలం ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేయలేదు.. పలు సంస్థలు, సొసైటీ యాజమాన్యాలు, బిల్డింగ్ ల ఓనర్లు ఇలా ఎవరికి వారు సీసీటీవీలను ఏర్పాటు చేసుకున్నారు.
సీసీటీవీ కెమెరాలు మాత్రమే కాకుండా హైదరాబాద్ పోలీసులు ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ రైల్వే స్టేషన్స్ లోనూ, ఇమ్లిబన్, జూబ్లీ బస్ స్టేషన్ల లో ఈ ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఉన్నాయి.