టెన్షన్ పెడుతున్న కేసులు.. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 6:49 AM GMT
టెన్షన్ పెడుతున్న కేసులు.. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో భారత్..!

గత 24 గంటల్లో భారత్ లో 27,094 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 676 మంది మరణించారు. కోవిద్-19 పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ లో 6,97,358కి చేరుకుంది. 19,963 మరణాలు ఇప్పటివరకూ సంభవించాయి. మూడు రోజులు వరుసగా 20000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు దేశంలో మొత్తం 99,69,662 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

నిన్న ఒక్కరోజులో 1,80,596 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. కరోనా కేసుల ప్రకారం భారత్ రష్యాను దాటేసింది. రష్యాలో కరోనా కేసుల సంఖ్య 681251 కాగా భారత్ ఆ సంఖ్యను దాటేసింది. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది భారత్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్ దేశాలలో భారత్ కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. రష్యాను ఓవర్ టేక్ చేసిన భారత్ ఇప్పుడు మూడో స్థానంలో వుంది.

కోవిద్-19 పాజిటివ్ కేసుల డేటాను Worldometer లో చూడొచ్చు.. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల విషయంలో భారత్ బ్రెజిల్, అమెరికా దేశాల తర్వాతి స్థానంలో నిలిచింది. బ్రెజిల్ లో కరోనా కేసులు 15,78,376 దాటగా, అమెరికాలో 29,54,999 కేసులు నమోదయ్యాయి.

భారత్ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రప్రభుత్వం సరికొత్త గైడ్ లైన్స్ తీసుకుని వచ్చింది. రాబోయే నెలల్లో కూడా ఎన్నో నిబంధలను పాటించాలంటూ రూల్స్ ను తీసుకుని వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడం అధికారులలో ఆందోళన కలిగిస్తూ ఉంది. కరోనా వ్యాక్సిన్ విషయంలోనే ఆశలు పెట్టుకున్నారు భారతీయులు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. హ్యూమన్ ట్రయల్స్ విషయంలో కంపెనీలు అడుగులు ముందుకు వేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆదివారం నాడు ప్రెస్ రిలీజ్ లో 2021 కంటే ముందే ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్ కు చెందిన రెండు వ్యాక్సిన్ లు Covaxin, ZyCov-D హ్యూమన్ ట్రయల్స్ వరకూ వెళ్లాయి. 140 సంస్థలు వ్యాక్సిన్లు తయారీకి సిద్ధమవుతూ ఉండగా అందులో 11 కంపెనీలు మాత్రమే హ్యూమన్ ట్రయల్స్ కు అర్హత సాధించాయి.

ప్రజలందరికీ పెద్ద ఎత్తున సరఫరా చేయాలంటే 2021 వరకూ ఆగాల్సిందే అని అంటున్నారు. హ్యూమన్ ట్రయల్స్ లో మనుషుల్లో వ్యాక్సిన్ తీసుకుని వచ్చే మార్పులు లాంటివన్నీ పరిశోధకులు ఓ కంట కనిపెడుతూ రావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ ను అందరికీ ఇవ్వడం కూడా అంత సులువైన అంశం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐసిఎంఆర్ చెప్పినట్లుగా ఆగష్టు 15కల్లా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడం కష్టమేనని పలువురు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు.

మహారాష్ట్రలో విపరీతంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడం అధికారులను కలవరపెడుతోంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 19331 మంది చనిపోగా, 8671 మంది మహారాష్ట్రలోనే మరణించారు.

Next Story
Share it