లాక్‌డౌన్ : ఎత్తివేతా.? కొన‌సాగింపా.?

By అంజి  Published on  8 April 2020 3:02 AM GMT
లాక్‌డౌన్ : ఎత్తివేతా.? కొన‌సాగింపా.?

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మాయ‌దారి వైర‌స్‌ క‌రోనాపై పైచేయి సాధించే దిశ‌గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్ని ర‌కాల క‌ట్టుదిట్ట‌మ‌న ఏర్పాట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మార్చి 22న మొద‌లైన లాక్‌డౌన్ గ‌డ‌వు ఏప్రిల్ 14తో ముగియ‌నుంది. కాగ‌, వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు విస్తృత‌మ‌వుతున్న నేఫ‌థ్యంలో మ‌రికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను కొనసాగించే దిశగా కేంద్రం యోచిస్తున్న‌ట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కరోనాను పూర్తిగా పైచేయి సాధించాలంటే లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గమని తెలంగాణ సహా పలు రాష్ట్రాల సీఎంలు, అధికార యంత్రాంగం సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచనలు చేస్తోందని తెలుస్తోంది. అయితే, లాక్‌డౌన్‌ కొనసాగింపు విష‌య‌మై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ స్పష్టం చేశారు. ఈ విషయమై ఎటువంటి ఊహాగానాలు చేయరాద‌ని సూచించారు.

ఇక విద్యాసంస్థల బంద్, ప్రార్థనా స్థలాల్లో నిర్వ‌హించే వివిధ‌ మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలను మే 15 వరకు కొనసాగించేలా చూడాల‌ని.. కరోనా ముప్పు అంచ‌నా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసిన‌ట్లు కూడా తెలుస్తుంది. అంతేకాదు.. ఏప్రిల్‌ 14 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించినా, ఎత్త‌వేసినా ఈ నిర్ణయాలను మాత్రం అమలు చేయవ‌ల‌సిందిగా సూచించిన‌ట్లు తెలుస్తుంది.

మ‌రోవారం రోజుల్లో ప్ర‌స్తుత‌మున్న లాక్‌డౌన్ ముగియ‌నున్న నేఫ‌థ్యంలో.. తరువాత నెలకొనే పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని జీఓఎం బృందం స‌మావేశ‌మైంది. హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పియూష్‌ గోయల్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లు పాల్గొన్న ఈ సమావేశంలో.. విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో కార్యకలాపాలను ఏప్రిల్‌ 14 తరువాత కూడా మ‌రో నెల రోజుల పాటు నిషేదించే దిశ‌గా ఆలోచ‌న‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా.. ప్రార్థ‌నా స్థ‌లాలు, షాపింగ్‌ మాల్స్ వంటి ప్రదేశాలలో డ్రోన్లతో సాయంతో నిఘా ఉంచాల‌ని.. ఏప్రిల్ రెండో వారంలోకి అడుగుపెట్టిన నేఫ‌థ్యంలో స్కూళ్ల‌కు ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కనుక జూన్‌ చివరి వరకు విద్యా సంస్థలను మూసేయడమే సరైన నిర్ణయమని.. కరోనాపై తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలు ఇచ్చే సమాచారమే కీలకమని జీఓఎం పేర్కొంది.

అలాగే.. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని.. నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా భేటీలో చర్చ జ‌రిగింద‌ని.. కరోనా కారణంగా నెలకొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై లోతైన చర్చ జరిపామని జీఓఎం భేటీ అనంతరం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ట్వీటర్ ద్వారా వెల్ల‌డించారు.

Next Story