భారత్ - చైనా సరిహద్దు.. గాల్వన్ లోయలో ఏం జరుగుతోంది..? ఘర్షణ ఎందుకు..?
By సుభాష్ Published on 17 Jun 2020 4:35 AM GMTభారత్ – చైనా సరిహద్దుల్లోని లడక్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు (37) వీరమరణం చెందారు. అలాగే రెండు దేశాల ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది వీరమరణం చెందగా, చైనాకు చెందిన 43 మంది సైనికులు చనిపోయినట్లు సమాచారం. ఇక గాయపడిన వారి సంఖ్య కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
గాల్వన్ వివాదం ఇప్పటిది కాదు..
కాగా, భారత్ - చైనా సరిహద్దుల్లో గల గాల్వన్ లోయ వివాదం ఇప్పటిది కాదు. భారత్ - చైనా మధ్య దాదాపు 3500 కిలోమీటర్ల పొడవున్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)పై ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. 1962లో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. 1962లో భారత్ -చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గాల్వన్ కూడా ఉంది. గల్వాన్ లోయ దగ్గర ఇండియాకు చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, దరుబక్ -ష్యంకు- దౌలత్‌బేగ్ ఓల్డీకి 225కిలోమీటర్ల రోడ్డుపై ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రహదారి గుండా వెళ్తే దౌలత్‌బేగ్ ఓల్డీకి వెళ్లే రోడ్డును కలుస్తోంది. ఇది పూర్తయితే భారత సైనికులు అరగంటలోపే గాల్వన్ లోయకు చేరుకోగలరు. అదే రోడ్డు కనుక లేకపోతే 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఇది గమనించిన చైనా ఆ రోడ్డును నిర్మించడానికి వీల్లేదంటోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా గాల్వన్ లోయలోకి ఆర్మీని పంపి ఆ భూభాగమంతా తనదేనంటూ చెబుతోంది చైనా. దీంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది.
చైనా సైన్యం రెచ్చగొట్టడంతోనే ఘర్షణలు
ఇక తాజాగా గాల్వన్ లోయలోకి ఓ ప్రదేశానికి చైనా బలగాలు రావడంతో వెనక్కి వెళ్లాలని భారత బలగాలను కోరాయి. ఈ వివాదం నెల రోజులకు పైగా కొనసాగుతోంది. కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాక, రెండు వైపులా సైన్యం వెనక్కి వెళ్లాలని నిర్ణయం వెలువడింది. ఇక వెనక్కి వెళ్తూ చైనా సైన్యం రెచ్చగొట్టడంతో ఘర్షణ మొదలై రెండు దేశాల ప్రాణ నష్టం జగినట్లు అధికారులు చెబుతున్నారు. గాల్వన్ లోయలో హైవే నిర్మాణ పనుల కోసం జార్ఖండ్ నుంచి 1600 మంది కార్మికులను భారత్ తరలించిన వెంటనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
నెల రోజులుగా ఉద్రిక్తత
ఈ నేపథ్యంలో గాల్వన్‌తో పాటు ప్యాంగాంగ్ సరస్సు, దెమ్ చోక్, దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో గత నెల రోజులుకు పైగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మే నుంచి చైనా వాస్తవాధీ రేఖ వెంట తన బలగాలను పెంచుతోంది. భారీ యుద్ద ట్యాంకులనుసైతం పంపింది. బంకర్లను నిర్మించింది. ఇక ఇదే సమయంలో నేపాల్ కొత్త మ్యాప్ తయారు చేసి భారత భూభాగం తమదేనంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే చైనా ఓ వ్యూహం ప్రకారమే చేస్తున్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు
రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో వాటిని చల్లార్చేందుకు రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మేజర్ జనరల్ అధికారుల స్థాయి ఘటన స్థలంలో చర్చలు జరుపుతున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాల్వన్ లోయలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో సోమవారం రాత్రి ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. పరిస్థితిని సద్దుమణిగేందుకు రెండు దేశాల సీనియర్ మిలటరీ అధికారులు ఘటన స్థలంలో సమావేశమైనట్లు అధికారుల ద్వారా సమాచారం.
చైనా బుకాయింపు..
కాగా, భారత సైనికులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ చైనా బుకాయిస్తోంది. రెండు దేశాల సైన్యం అత్యున్నత స్థాయి సమావేశమై, వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే సోమవారం భారత బలగాలు దీనిని ఉల్లంఘించి రెండు సార్లు వాస్తవాధీన రేఖని దాటాయి. దీని వల్ల తీవ్ర స్థాయి ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణపై భారత్‌కు తీవ్ర నిరసన తెలియజేశామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో తెలిపారు. అయితే తమ సైనికులు ఎంత మంది చనిపోయారన్న విషయం చైనా వెల్లడించలేదు. 43 మంది వరకూ చనిపోయారని ప్రముఖ మీడియా సంస్థల ద్వారా సమాచారం.
భారత్ సమాలోచనలు
ఈ ఘటనపై మంగళవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను ప్రధాని నరేంద్రమోదీకి వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితులను తెలియజేశారు. దాదాపు గంట పాటు వీరి మధ్య భేటీ జరిగింది.