గాల్వన్ భారత్ దే అని స్పష్టం చేస్తున్న గులామ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
By సుభాష్ Published on 19 Jun 2020 10:55 AM ISTభారత్ - చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కారణమైన గాల్వన్ ప్రాంతం భారత్ దే అయినప్పటికీ.. డ్రాగన్ మాత్రం అది తనదంటోంది. తాను కన్నేసిన అన్ని ప్రాంతాల్ని తమదిగా చెప్పుకునే అలవాటు చైనాకు మొదట్నించి వస్తున్నదే. భారత సరిహద్దుల్లోకి వచ్చి.. ఇనుప కడ్డీలు.. కర్రలు.. రాళ్లతో దాడి చేయటం.. దీనికి మన సైనికులు ధీటుగా బదులివ్వటం తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇరవై మంది వీరమరణం పొందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో చైనాకు చెందిన నలభైఐదు మంది సైనికులు మరణించటమో.. గాయపడటమో జరిగిందని చెబుతున్నారు.
చైనా ప్రభుత్వం మాత్రం తమ సైనికుల సంఖ్య మీద స్పందించటానికి సుముఖత ప్రదర్శించలేదు. ఇలాంటివేళ.. ఈ మొత్తం ఘర్షణకు కారణమైన గాల్వన్ ప్రాంతం ఎవరిదన్న ప్రశ్న అంతర్జాతీయంగా పలువురిలో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. గాల్వన్ ప్రాంతం ఎప్పటికి భారత్ దేనని మహ్మద్ అమిన్ గులాన్ మనమడు గులామ్ రసూల్ స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ మహ్మద్ అమిన్ ఎవరంటే 1878లో లేహ్ లో పుట్టిన ఆయన.. అప్పట్లో టిబెట్.. మధ్య ఆసియా కొండల్లోని కారకోరం కనుమల్లో బ్రిటిష్ పాలకులకు గైడ్ గా వ్యవహరించేవారు.
ఈ ప్రాంతం మీద మంచి పట్టున్న అతడు.. గాల్వన్ ప్రాంతం ఎప్పటికి భారత్ దేనని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక జాతీయ మీడియాతోమాట్లాడారు. 1962లో కూడా ఇప్పటిమాదిరే ఈ ప్రాంతాన్ని చైనా అక్రమించే ప్రయత్నం చేసిందన్నారు. అప్పుడు కూడా మన సైనికులు వారితో పోరాడారని.. ఇప్పుడు మళ్లీ చైనా సైనికులు అదే రీతిలో వ్యవహరించారన్నారు. భారత సైనికుల్ని గౌరవిస్తామని.. వారి త్యాగాలకు జోహార్లు అని పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఎప్పటికి భారత్ లోనే భాగంగా ఉంటుందన్నారు.