బ్యాన్‌తో ఆగకూడదు.. ట్రాయ్ ను సీన్లోకి దించితేనే చైనాకు చురుకు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Jun 2020 10:58 AM ISTచైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్స్ ను భారత సర్కారు నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవటం పాత విషయం. బ్యాన్ చేసిన తర్వాత దాని ప్రభావం చైనాకు తాకాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే.. టిక్ టాక్ తో పాటు.. చాలా యాప్స్ కు కోట్లాది డౌన్ లోడ్స్ ఉన్నాయి. తాజాగా విధించిన బ్యాన్ తో కొత్తగా డౌన్ లోడ్ చేసుకునే వారికి మాత్రమే తప్పించి.. ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వారు వినియోగించుకునే వీలుంటుంది. అదే జరిగితే.. బ్యాన్ నిర్ణయంతో ఎలాంటి ప్రభావం ఉండదు.
బ్యాన్ చేసిన నిర్ణయాన్ని గూగుల్.. యాపిల్ కు తెలియజేసి.. ప్లే స్టోర్ లో ఆ యాప్స్ లేకుండా చేయటంతో పాటు.. ట్రాయ్ ను సీన్లోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే నిషేధం తాలుకూ ప్రభావం చైనాకు తెలుస్తుంది. ఎందుకంటే.. ఐఎస్ పీలు.. టెలికాం సంస్థలు కేంద్రం బ్యాన్ చేసిన యాప్స్ ను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అది జరిగితే కానీ.. అప్పటికే సదరు యాప్స్ మొబైల్ లో ఇన్ స్టాల్ అయినా.. అవి పని చేసే అవకాశం ఉండదు.
అయినప్పటికి వాటిని వాడాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. సదరు యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించారన్న సందేశం వస్తుంది. అప్పుడు మాత్రమే.. సదరు యాప్స్ కు వినియోగదారుల సంఖ్య భారీగా పడిపోవటంతో పాటు.. వాటి ఆర్థిక మూలాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతిమంగా.. చైనా సర్కారు ఆ వేడి తగులుతుంది. కేంద్రం నిషేధించిన 59 యాప్స్ తో పాటు.. చైనాకు చెందిన మరిన్ని యాప్స్ ను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఇందులో కీలకమైనది పబ్-జీ. ఈ ఆన్ లైన్ గేమ్ తో చాలామంది పిల్లలు తమ చదువుల్ని పక్కన పెట్టేసి.. దీనికి బానిసలుగా మారిపోయారు. కొందరైతే.. చనిపోయారు కూడా. ఈ యాప్ ను బ్యాన్ చేయాలని తల్లిదండ్రులు ఎంతో కాలంగా మొత్తుకుంటున్నారు. పిల్లలపై అమితమైన ప్రభావాన్ని చూపే ఈ యాప్ ను నిషేధిస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.