చైనాకు షాకిచ్చిన భారత్‌: టాక్‌టాక్‌తో పాటు 59 యాప్స్‌ నిషేధం

By సుభాష్  Published on  29 Jun 2020 3:42 PM GMT
చైనాకు షాకిచ్చిన భారత్‌: టాక్‌టాక్‌తో పాటు 59 యాప్స్‌ నిషేధం

చైనాకు భారత ప్రభుత్వం షాకిచ్చింది. టిక్‌టాక్‌ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌తో పాటు చైనాకు సంబంధించిన 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వుయ్‌చాట్‌, హలో యాప్‌, వుయ్‌ సింక్‌, మై కమ్యూనిటీ, వైరస్‌ క్లీనర్‌, షేర్‌ ఇట్‌తో పాటు చైనాకు సంబంధించిన మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధించింది.

కాగా, ఇటీవల భారత్‌ -చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దీంతో చైనా యాప్‌లను నిషేధించే విధంగా కేంద్రం అడుగులు వేసింది. అంతేకాదు చైనా యాప్‌లను నిషేధించాలని నెటిజన్ల నుంచి కూడా భారీ ఎత్తున డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ సమగ్రతకు ఈ యాప్స్‌ ద్వారా ముప్పు పొంచి ఉందని కేంద్రం పేర్కొంది. 130 కోట్ల మంది ప్రజల డేటా ప్రమాదంలో పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చైనా యాప్‌ ద్వారా భారతీయుల డేటా చోరీ అవుతుందని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే భారతదేశం బయటున్న సర్వర్లకు ఈ యాప్స్‌ ద్వారా డేటా వెళ్తోందని, దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధించినట్లు కేంద్రం వెల్లడించింది.Tiktok Bsn 3

Next Story
Share it