ఐపీఎల్‌లో ధోని విఫలమైతే..? డీన్‌జోన్స్ ఏమన్నాడంటే..?
By తోట వంశీ కుమార్ Published on 25 July 2020 12:39 PM ISTకరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడగా.. కనీసం ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను అన్నా చూద్దామని అనుకున్నారు క్రికెట్ ప్రేమికులు. కాగా.. టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయడంతో అభిమానులు నిరాశకు గురైయ్యారు. అయితే.. నిరవధిక లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమయర్ లీగ్(ఐపీఎల్) సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ తెలపడంతో.. ఈ ధనాధన్ క్రికెట్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించనున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు.
ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో.. ఇక అందరి దృష్టి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పడింది. గతేడాది ప్రపంచకప్‌లో సైమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం తిరిగి ధోని అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ధోని రిటైర్‌మెంట్‌పై వార్తలు వినిపించాయి. అయితే.. ఇప్పటి వరకు ధోని వీటిపై స్పందించలేదు. ఐపీఎల్‌లో రాణిస్తే ధోనిని జాతీయ జట్టులోకి తీసుకుంటామని గతంలో టీమ్‌ఇండియా కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో రాణించేందుకు ధోని ప్రాక్టీస్ మొదలెట్టగా.. కరోనా మహమ్మారి కారణంగా టోర్నీ వాయిదా పడింది. ఇప్పుడు ప్రపంచకప్ రద్దు కావడంతో ఐపీఎల్ జరగనుంది. దీంతో మహికి మరో అవకాశం లభించినట్లు అయింది. ఇక ఐపీఎల్‌లో మహేంద్రుడు ఎలా ఆడతాడు అన్నదానిపైనే ధోని భవితవ్యం ఆధారపడి ఉంది.
కాగా.. ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెలకర్లు యువఆటగాడు రిషబ్‌పంత్, కేఎల్ రాహుల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అన్నాడు. ఒకవేళ ధోని ఐపీఎల్‌లో రాణిస్తే.. అతడి పునరాగమనం ఖాయమని, విఫలమైతే మాత్రం టీమ్‌ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనన్నాడు. మహికీ ఇంకా అవకాశం ఉందని, కరోనా కారణంగా లభించిన ఈ విరామం కూడా ధోనికి కలిసి రావచ్చునన్నాడు. అయితే.. వయసు పెరిగే కొద్ది ఒక ఆటగాడు విరామం తీసుకుని మళ్లీ రాణించడం చాలా కష్టం అని మాత్రం చెప్పగలనని జోన్స్ తెలిపాడు. ధోని అద్భుత ఆటగాడని కితాబు ఇచ్చాడు. ప్రస్తుత భారత జట్టును వేదిస్తున్న సమస్య అద్భుతమైన ఫినిషర్ లేకపోవడమేనని స్పష్టం చేశాడు.