లాక్‌డౌన్‌లోనూ ఆగ‌ని ఇడ్లీ బామ్మ‌.. రూపాయికే ఇడ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2020 5:36 AM GMT
లాక్‌డౌన్‌లోనూ ఆగ‌ని ఇడ్లీ బామ్మ‌.. రూపాయికే ఇడ్లీ

రూపాయికి ఏం వ‌స్తుంద‌ని మ‌న‌లో చాలా మంది అనుకుంటారు. రూపాయికీ ఇడ్లీ వ‌స్తే.. ఏం న‌మ్మ‌కం లేదా.. నిజంగా నిజమండి బాబు. అవును రూపాయికే ఇడ్లీ దొరుకుతోంది. అయితే.. అది మ‌న ద‌గ్గ‌ర కాదులెండి త‌మిళ‌నాడులో.

కోయంబ‌త్తూర్‌కి చెందిన క‌మ‌లాత్తాళ్ వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. అందురూ ఆమెను ఇడ్లీ అమ్మ లేదా ఇడ్లీ బామ్మ అని పిలుస్తుంటారు. ఎవ‌రైనా ఆక‌లితో ఉంటే.. లేదు అన‌కుండా కడుపునింపుతుంది. దాదాపు ముడు ద‌శాబ్దాలుగా ఆమె రూ.1 కే ఇడ్లీలు అందిస్తోంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా ఎంతో మంది వ‌ల‌స కార్మికులు అవ‌స్త‌లు ప‌డుతున్నారు. ప‌నులు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటి వారికి రూపాయికే ఇడ్లీల‌ను అందిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇడ్లీ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్నా..బామ్మ మాత్రం రోజు ఇడ్లీలు అమ్ముతోంది. దీని వ‌ల్ల ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నా.. మ‌న‌సుకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంద‌ని బామ్మ చెబుతోంది.

ఎన్ని క‌ష్టాలనైనా ఎదుర్కొంటాను కానీ ఇడ్లీ ధ‌ర‌ల‌ను మాత్రం పెంచ‌న‌ని అంటోంది బామ్మ‌. ప్ర‌స్తుత స‌మ‌యంలో ప‌లువురు ఆమెను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని చెప్పుకొచ్చింది. కొంద‌రు ఇడ్లీ త‌యారీకి కావాల్సిన వ‌స్తువుల‌ను పంపుతున్నార‌ని తెలిపింది. వారు పంపిన స‌రుకుల‌తో ఇడ్లీలు త‌యారు చేసి పేద వారికి ఒక్క రూపాయికే అమ్ముతున్న‌ట్లు వెల్ల‌డించింది. రోజుకు సుమారు 400 మందికి ఇడ్లీల‌ను అందిస్తోంది బామ్మ‌.85 ఏళ్ల వయసులో కూడా ఇతరులకు సాయం చేయాలనే ఆమె గొప్పతనం ఎందరికో ఆదర్శం.

ఇక బామ్మ గురించి తెలుసుకున్న వారు ఆమె చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడుతున్నారు. భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్‌కైఫ్ బామ్మ సేవ‌ల‌ను కొనియాడుతూ మంగ‌ళ‌వారం ట్వీట్ చేశారు. అంద‌రూ ఆమెను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పేర్కొన్నారు.

Next Story