పసికందుతో 150 కి.మీ నడిచిన బాలింత..! చివరికి..

By Newsmeter.Network  Published on  13 May 2020 3:21 AM GMT
పసికందుతో 150 కి.మీ నడిచిన బాలింత..! చివరికి..

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో వలస కార్మికులు ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఉన్నచోట పనిలేక.. తమ ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కాలినడకన తమ ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తమ ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నంలో మార్గం మధ్యలోనే నిండు గర్భిణీ రోడ్డు పక్కనే బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పలువురు మార్గం మధ్యలోనే మృత్యువాత పడ్డారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డతో బాలింత 150 కి.మీ నడిచిన ఘటన జరిగింది. చివరకు మహారాష్ట్ర - మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని బిజాసాన్‌ చెక్‌ పోస్టు వద్ద బాలింతను పోలీసులు గుర్తించి.. క్షేమంగా ఇంటికి చేర్చారు.

Also Read :మే 18 నుంచి లాక్‌డౌన్‌ 4 : ప్రధాని మోదీ

వివరాల్లోకి వెళితే.. సాత్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాకేశ్‌ కౌశల్‌, శకుంతల దంపతులు కొద్దికాలం క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌కు వలస వెళ్లారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కరువై.. తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. అప్పటికే శంకుతల నిండు గర్భిణి. మే5న నాసిక్‌ నుంచి సాత్నాకు నడక ప్రారంభించారు. పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆగ్రా - ముంబయి జాతీయ రహదారి పక్కన శకుంతల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే 70కి.మీ నడిచారు. ఆ తర్వాత రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లి నడక ప్రారంభించింది. మార్గం మధ్యలో ఆగుకుంటూ 150 కి.మీ ప్రయాణం నడక సాగించారు. మహారాష్ట్ర - మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని బిజాసాన్‌ చెక్‌ పోస్టు వద్ద బాలింతను గుర్తించిన పోలీసులు చలించిపోయారు. అప్పటికే ఆ యువతీ పూర్తిగా నీరసించి పోయింది. వెంటనే పోలీసులు తల్లి, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలపడంతో వారి సొంత గ్రామానికి సురక్షితంగా తరలించారు.



Next Story