గ్రామాల్లోనే ఎక్కువ మందికి కరోనా.. ఐసీఎంఆర్ సెరో సర్వేలో సంచలన నిజాలు
By సుభాష్ Published on 11 Sept 2020 1:08 PM IST![గ్రామాల్లోనే ఎక్కువ మందికి కరోనా.. ఐసీఎంఆర్ సెరో సర్వేలో సంచలన నిజాలు గ్రామాల్లోనే ఎక్కువ మందికి కరోనా.. ఐసీఎంఆర్ సెరో సర్వేలో సంచలన నిజాలు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/09/ICMR-Sero-Survey.jpg)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక భారత్‌లో కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది. మొదట్లో పట్టణ ప్రాంతాల్లోనే పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో ఉండగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక తాజాగా ఐసీఎంఆర్ నిర్వహించిన మొట్ట మొదటి జాతీయ సెరో సర్వేలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేకు సంబంధించిన ఫలితాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. వీటన్నింటిని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్‌లో ప్రచురితం అయ్యాయి. భారతదేశంలోని గ్రామాలలో మొత్తం 69.4 శాతం మందికి కరోనా వైరస్ సంక్రమించినట్లు సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 15.9 శాతం మందికి, మిగిలిన ప్రాంతాల్లో 14.6శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. దేశంలోని 0.73 శాతం మంది వ్యక్తులు (పెద్దలు) కోవిడ్ ప్రభావానికి లోనైట్లు ఐసీఎంఆర్ అభిప్రాయపడింది.
18-45 ఏళ్ల వయసున్న వారికి పాజిటివిటీ అత్యధికంగా 43.3 శాతం ఉంది, ఆ తర్వాత 46-60 ఏళ్ల వయసున్న వారిలో 39.5శాతం ఉండగా, 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యల్పంగా కరోనా పాజిటివిటి ఉన్నట్లు తేలింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లో 700 గ్రామాలు, వార్డుల్లో మే 11 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగింది. కోవిడ్ కవచ్ ఎలీసా కిట్ ఉపయోగించి మొత్తం 28వేల మందికి రక్తనమూనాలు సేకరించి ఐజీజీ యాంటీబాడీస్ కోసం పరీక్షించింది.
భారత్‌లో ప్రస్తుతం 45 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కానీ మే నెల వరకే దేశంలో 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని ఐసీఎంఆర్ అంచనా వేసింది. అలాగే మే నెలలో సగటున 82 నుంచి 130 మందికి సోకిన ఇన్‌ఫెక్షన్లను గుర్తించలేకపోయినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. తొలుత పెద్ద నగరాల్లో కేసులు నమోదయినా.. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు కరోనా వ్యాప్తి చెందడం కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది.
కాగా, కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు సైతం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. వ్యాక్సిన్ తయారీలో భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్రయల్స్ నిర్వహిస్తోంది. కొన్ని వ్యాక్సిన్లు రెండు, దశలో ఉంటే మరి కొన్ని దేశాల వ్యాక్సిన్లు రెండో దశలో, చివరి దశలో ఉన్నాయి. దాదాపు వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే సమయం కూడా దగ్గరలోనే ఉంది. మహమ్మారి కారణంగా దేశ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి.