ఆ ఐఏఎస్ అధికారిణి చేసిన పని వల్ల.. 36 మందికి కరోనా
By తోట వంశీ కుమార్ Published on 11 April 2020 3:53 PM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా మరణించగా.. 16 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మనదేశంలో కూడా కరోనా వ్యాప్తికి దేశవ్యాప్త లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.
చైనాలో పుట్టిన ఈ మహమ్మారి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. దీంతో విదేశాల నుంచి వచ్చే వారికి తప్పని సరిగా.. కరోనా టెస్టులు చేయడంతో పాటు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఐఏఎస్ అధికారిణి ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన తన కొడుకు ట్రావెల్ హిస్టరీని దాచిపెట్టింది. ఫలితంగా 36 మందికి కరోనా సోకింది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ పల్లవి జైన్ గొవిల్ వ్యవహారం వివాదంగా మారుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ అయిన ఆమె కరోనా పై అందరికి అవగాహాన కల్పించాల్సింది పోయి.. విదేశాల నుంచి వచ్చిన తన కొడుకు ట్రావెల్ హిస్టరీని దాచిపెట్టింది. ఫలితంగా 36 మందికి కరోనా సోకింది. కొడుకు ద్వారా ఆమెకు కరోనా సోకగా.. అది బైటపడేలోపే.. ఆమె ఇతర అధికారులతో కలిసి అనేక సమీక్షల్లో పాల్గొంది. దీంతో ఆమె చేసిన పని వల్ల మధ్యప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో మొత్తం 36 మంది అధికారులకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషనల్ లో ఉంది. తాను ఆస్పత్రికి రానని ఇంటికే వచ్చి వైద్యం చేయాలని ఆదేశాలు సైతం జారీచేసింది.
ఉన్నతాధికారి కావడంతో.. ఎవరు ఏం మాట్లాడలేదు. డాక్టర్లు కూడా రోజు ఉదయం, సాయంత్రం ఆమె ఇంటికే వెళ్లి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం మానవ హక్కుల సంఘానికి ఎవరో ఫిర్యాదు చేశారు. దీంతో మానవహక్కుల సంఘం ఈ ఘటన పై సీరియస్ అయ్యింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆస్పత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.