స్విగ్గీ బాయ్ ని దూషించిన కేసులో కస్టమర్ పై కేసు..!
By సత్య ప్రియ Published on 25 Oct 2019 5:43 AM GMTముఖ్యాంశాలు
- అక్టోబర్ 24న, హైదరాబాద్ లోని షాలీబండా పోలీస్ స్టేషన్లో అజయ్ కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు
- అజయ్ గ్రీన్ బావర్చీ నుంచి చికెన్ 65 ని స్విగ్గీ ద్వారా ఆర్డర్. ఆ డెలివరీని హిందూ డెలివరీ బాయ్ తోనే పంపవలసిందిగా అభ్యర్ధన
- ఈ ఉదంతంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయని స్విగ్గీ
హైదరాబాద్: ముస్లిం డెలివరీ బాయ్ ని దూషించినందుకు స్విగ్గీ వినియోగదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొహమ్మద్ ముద్దసిర్ సులేమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాలీబండా పోలీసులు అక్టోబర్ 24న అజయ్ కుమార్ పై కేసు పెట్టారు. బెదిరింపులకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. శాంతి సామరస్యలను భంగపరిచే విధంగా ఒక వ్యక్తిని దూషించినందుకు సెక్షన్ 506 , సెక్షన్ 504 సెక్షన్ల పై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం.. ఆలియాబాద్ లో ఉండే అజయ్, గ్రీన్ బావర్చీ నుంచి తను ఆర్డర్ చేసిన చికెన్ 65 ని తెచ్చి ఇచ్చేందుకు స్విగ్గీ యాప్ లో హిందు డెలివెరీ బాయ్ కోసం అభ్యర్ధించాడు. అయితే, డెలివరీ చేసేందుకు ముద్దసిర్ సులేమాన్ ఫోను చేయగా అతనిని దూషించాడు, అతను తెస్తే పార్సెల్ తీసుకొననీ, ఒక హిందువు డెలివరీ చేస్తేనే తీసుకుంటాననీ చెప్పాడు.
స్విగ్గీ కస్టమర్ కేర్ కి ఫోను చేసి ఫిర్యాదు కూడా చేశాడు. ఈ సంభాషణ అంతా రికార్డ్ అయ్యింది.(ఈ రికార్డింగ్ కాపీ న్యూస్ మీటర్ వద్ద ఉంది. అందులో "నాకు ముస్లిములు తీసుకువచ్చే భోజనం అక్కరలేదు" అని అజయ్ అనడం వినొచ్చు). ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ ఉదంతంపైన స్విగ్గీ ఇంకా నోరు విప్పలేదు.
అక్టోబర్ 21న జరిగిన ఈ సంఘటన మూడు రోజుల తరువాత, సులేమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాక బయటికి వచ్చింది. న్యుస్ మీటర్ తో మాట్లాడుతూ సులేమాన్, తాను ఫిర్యాదు ఇచ్చిన తరువాత కొన్ని వందల ఫోన్లు వచ్చాయనీ కానీ తన కొడుకు వేరే చోట ఉంటున్న కారణంగా ఫోను స్విచ్ ఆఫ్ చేయలేకపోయాననీ చెప్పాడు. ఫిర్యాదు చేసిన రోజునే తన స్నేహితుడి తండ్రి కూడా మరణించాడని, దీంతో ఇంకా కష్టమయ్యిందని చెప్పాడు.
మజ్లిస్ బచావో తెహ్రీక్ ప్రతినిధి అంజెద్ ఉల్లా ఖాన్, ఈ సంఘటన గురించి మాట్లాడుతూ, ఇటువంటి మతతత్వ నైజాన్ని ఖండిస్తున్నాననీ అన్నారు. స్విగ్గీ వారికి, అజయ్ కుమార్ కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయమని చెప్పానని, రెండు సమూహాల మధ్య ఉన్న గంగా జమునా సంస్కృతి మనమే కాపాడుకోవాలన్నారు.
తినే పదర్ధలపైన మతం రంగు పూయడంపై ఎందరో సోషల్ మీడియా మాద్యమాలలో ధ్వజం ఎత్తుతున్నారు. ముస్లిముల రెస్టారెంట్‌లో భోజనం ఆర్డర్ చేసి ముస్లిములు తీసుకురాకూడని అనడం ఎంత వరకూ సమంజసం అని అంటున్నారు.
రెండు నెలల క్రితం, మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో హిందువేతర డెలివరీ బాయ్ తీసుకు వచ్చినందుకు ఒక వినియోగదారుడు భోజనాన్ని తిరిగి పంపాడు. శ్రావణ మాసం కావున తాను ఇతరులు తాకిన భోజనాన్ని తీసుకోలేనని చెప్పాడు. అయితే, జొమాటో సంస్థ డెలివరీ చేసే వ్యక్తి ని మతపరమైన కారణాల వల్ల తాము మార్చలేమని చెప్పింది. "స్వతంత్ర దేశమైన భారతదేశంలో ఇలాంటివి ప్రోత్సహించలేమనీ, మాకు నష్టం వచ్చినా సరే ఇలాంటి అభ్యర్ధనలను అంగీకరించబోము" అని జొమాటో సంస్థ అప్పుడు ట్వీట్ చేసింది.