పబ్లిక్‌లో రీల్స్ పై తెలంగాణా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వీడియోల కోసం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవని.. అలాంటి వారిపై కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయి.. జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్‌లో రీల్స్ చేసిన యూట్యూబర్ హర్ష@మహాదేవ్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో 336, 341, 290 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
కూకట్‌పల్లి పరిధిలో మహదేవ్ అనే యువకుడు నడిరోడ్డు మీద బైక్ పై వెళ్తూ.. కరెన్సీ నోట్లు గాల్లోకి వెదజల్లుతూ వీడియో తీశాడు. డబ్బులు కింద పడడంతో అక్కడున్న జనాలు డబ్బుల కోసం పరుగులు తీశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహదేవ్ గతంలో కూడా మరోచోట ఇదేవిధంగా చేశాడు. ఇలా పైసలు వెదజల్లడం తన స్టైల్ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి నకిలీ నోట్లు కాదని అసలు సిసలైన డబ్బులని.. నేను పది మందికి డబ్బులు పంచుతున్నానని.. మంచి పని చేస్తున్నానని చెప్పుకుంటూ వీడియో తీశాడు. డబ్బులు బాగా సంపాదించాలంటే తన టెలిగ్రామ్‌లో వచ్చే మెసేజ్‌ను క్లిక్ చేసి జాయిన్ కండి.. డబ్బులు సంపాదించండి అంటూ సలహాలు కూడా ఇచ్చాడు. నిన్నటి నుండి తన గురించే టీవీలలో బాగా చెప్తున్నారని తాను చాలా మంచోడు అని.. పదిమందికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉన్నవాన్ని అంటూ మరో వీడియో విడుదల చేశాడు. సోషల్ మీడియాలో వీడియోలతో రచ్చ చేస్తున్న మహదేవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధంగా రీల్స్ కోసం వీడియోల కోసం బైక్ పై వింత వింత స్టంట్ లు వేస్తూ... రోడ్ల మీద నానా హంగామా చేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.