దేశంలో ప్రజాస్వామ్యాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి యువత సిద్ధంగా ఉంది
భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల ప్రాణత్యాగాన్ని స్మరిస్తూ “అమరుల దినం” సందర్భంగా ‘జనగణమన అభియాన్’ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని
By Medi Samrat Published on 23 March 2024 3:30 PM GMTభగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల ప్రాణత్యాగాన్ని స్మరిస్తూ “అమరుల దినం” సందర్భంగా ‘జనగణమన అభియాన్’ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని లామకాన్ లో యువతతో కార్యక్రమం నిర్వహించింది. “Expression of Freedom” అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రొ. జి. హరగోపాల్, సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జన గణ మన అభియాన్ తరఫున విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, క్రాంతి కుమార్, ఆర్.నవీన్ కుమార్, కె.నాగార్జున నిర్వహించారు.
“దేశంలో రాజ్యాంగ విలువలను, మత సామరస్యాన్ని కాపాడుకోవడం – పౌరుల పాత్ర” అనే అంశాలపై జనగణమన అభియాన్ కాలేజీ స్థాయిలో వ్యాసరచన, షార్ట్ వీడియో, నినాదాల పోటీలు జనవరి నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుండి 35 కాలేజీల నుండి, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల నుండి వందలాది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల విజేతలకు ప్రొ. హరగోపాల్, ఖలీదా పర్వీన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో విజేతలతో బాటు అనేక కాలేజీ విద్యార్థులు, ప్రముఖ సామాజిక కార్యకర్త ఆర్.వెంకట రెడ్డి పాల్గొన్నారు.
వ్యాసరచన పోటీలో మొదటి బహుమతిని మిర్యాలగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఎండి. యాస్మీన్ అనే విద్యార్థిని, రెండవ బహుమతిని వనపర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాల నుండి నాయని శ్రీలత, మూడవ బహుమతిని మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి హెచ్.డి. శ్రీకాంత్, గెలుచుకున్నారు. షార్ట్ వీడియో పోటీలో మొదటి మూడు బహుమతులను కరీంనగర్ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి గుడెల్లీ నరేష్, షాద్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి కె. ప్రవల్లిక, ఇబ్రహీంపట్నం సోషల్ వెల్ఫేర్ కళాశాల నుండి సౌమ్య సాధించారు. నినాదాల పోటీలో జనగామ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి బొంకూరి దివ్యశ్రీ,, మణుగూరు ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుండి పుట్టబంతి హేమంత్, సూర్యాపేట సోషల్ వెల్ఫేర్ కళాశాల నుండి జి.రమ్య బహుమతులు గెలుచుకున్నారు.
ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ “భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ప్రాణ త్యాగం చేసినది కేవలం బ్రిటిష్ వాళ్ళను వెళ్లగొట్టడానికి కాదు, వాళ్ళు కలలు కన్న భారత దేశం సాధిస్తామన్న ఆశతో. ఆర్థిక సమానత్వంబ గురించి, సామాజిక న్యాయం గురించి, మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఆనాడే వాళ్ళు మాట్లాడారు. అటువంటి స్వాతంత్యోద్యమ విలువల ఆధారంగా, అంబేద్కర్, నెహ్రూ వంటి గొప్ప నాయకుల నేతృత్వంలో మన రాజ్యాంగం ఏర్పడింది. సమానత్వం, మాట్లాడే స్వేచ్ఛ, ప్రజలందరికీ ప్రజాస్వామిక హక్కులు, లౌకిక తత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ రాజ్యాంగంలో ముఖ్య విలువలు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనను విమర్శిస్తూ కార్టూన్లు వేసే శంకర్, ఆర్కే లక్ష్మణ్ వంటి వారిని ప్రోత్సాహించే వారు, ప్రభుత్వం పై మరింత పదునైన కార్టూన్లు వేయాలి అనేవారు.
గత పదేళ్లుగా మన ప్రాథమిక రాజ్యాంగ విలువలు కూడా ప్రమాదంలో పడ్డాయి. రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చేయాలని బీజేపీ, ఆర్ఎసెస్ కంకణం కట్టాయి. దీనిని ఎదుర్కోవడానికి ప్రజలే నిలబడాలి, ముఖ్యంగా యువత నిలబడాలి. ఈరోజు విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది,” అని అన్నారు.
ఖలీదా పర్వీన్ మాట్లాడుతూ, “ఈరోజు మన దేశంలో అధికారంలో ఉన్నవాళ్లే రాజ్యాంగ రక్షణ కోసం కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సీ.ఏ.ఏ. లాంటి చట్టాలు, ఎనార్సీ లాంటి ప్రక్రియలతో మతాల మధ్య అసమాన వైఖరిని రాజ్యాంగ విరుద్ధంగా తీసుకు వస్తున్నారు. అయితే, మన భారత దేశంలో తరతరాల నుండి అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటున్నారు. దీనిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎలా అయితే విద్వేషపూరిత, అబద్ధపు ప్రచారపు మెసేజ్ లు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతున్నాయో, దానిని ఎదుర్కోవడానికి మీవంటి యువత రాజ్యాంగ విలువల గురించి, మత సామరస్యాన్ని గురించి, మన కలల భారత దేశం గురించి మరింత ఎక్కువ వ్యాప్తి చెందేలా కృషి చేయాలి,” అని పిలుపునిచ్చారు.
బహుమతి పొందిన విద్యార్థులు వారి వ్యాసాలను చదివారు. కొందరు విద్యార్థులు ఈ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్.వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి యువతీ యువతులు మాట్లాడిన మాటలు, వాళ్ళు రాసిన వ్యాసాలు విని తనకు ఊరట కలిగిందని, మన దేశ భవిష్యత్తు మంచి చేతులలోనే ఉన్నట్లు నమ్మకం కలిగిందన్నారు. అయితే మంచి భావాలు కలిగిన వారి సంఖ్య మరింత పెంచి వ్యతిరేక భావాలను ఎదుర్కొనే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు.