మటన్‌లో బూజు.. చికెన్‌లో పురుగులు.. బయట హోటల్‌లో తింటున్నారా.. జాగ్రత్త.!

Worm-infested chicken and moldy mutton at a restaurant in Hyderabad. ప్రజల ప్రాణాల కంటే.. వ్యాపారమే ముఖ్యమైపోయింది కొందరికి. డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

By అంజి  Published on  10 Nov 2021 8:57 AM IST
మటన్‌లో బూజు.. చికెన్‌లో పురుగులు.. బయట హోటల్‌లో తింటున్నారా.. జాగ్రత్త.!

ప్రజల ప్రాణాల కంటే.. వ్యాపారమే ముఖ్యమైపోయింది కొందరికి. డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కుళ్లిపోయిన మంసాన్ని వండిపెడుతున్నారు కొందరు హోటల్‌ యాజమాన్యాలు. బూజు పట్టిన మటన్‌.. పురుగులు పట్టిన చికెన్‌ను కస్టమర్లకు వండిపెట్టి.. వారి అనారోగ్యానికి కారణం అవుతున్నారు. తాజాగా బండ్లగూడజాగీర్‌ నగర పాలక సంస్థ పరిధిలోని ఓ హోటల్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. రోజుల తరబడి నిల్వ ఉంచిన మంసాన్ని వండి పెడుతూ అధికారులకు అడ్డంగా దొరికాడు ఓ హోటల్‌ నిర్వహకుడు. బండ్లగూడ జాగీర్‌ జంక్షన్‌లోని పెట్రోల్‌ బంక్ పక్కన ఉన్న ఓ రెస్టారెంట్‌పై నగరపాలక సంస్థ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరిశెట్టి మనోహర్‌, స్థానిక టీఆర్ఎస్‌ నాయకుడు మద్దెల ప్రేమ్‌ గౌడ్‌, మరికొందరు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచిన బూజుపట్టిన మటన్‌, పురుగులు పట్టిన చికెన్‌ను గుర్తించారు. అదే సమయంలో రెండు రోజుల క్రితం చేసిన బిర్యానీని తిరిగి వేడి చేస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్‌లోని ఆహార పదార్థాలను నాణ్యత పరిశీలన కోసం సేకరించామని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ గౌరిశెట్టి మనోహర్‌ తెలిపారు. హోటల్‌ నిర్వాహకుడికి రూ.5 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలానే జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. నిల్వ చేసి ఉన్న మటన్‌లో పురుగులు ఉండి.. అలాంటి మాంసం తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. బయట హోటల్‌లో నాన్‌వెజ్‌ తినాలనుకునేవారు.. తాజా ఆహారం ఉంటనే వెళ్లడం మంచిది.

Next Story