సస్పెన్షన్ రద్దు చేయకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయను: రాజా సింగ్
సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.
By అంజి Published on 1 March 2023 11:03 AM ISTగోషామహల్ ఎమ్మల్యే టి.రాజాసింగ్
హైదరాబాద్: పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నేత రాజాసింగ్ మంగళవారం స్పష్టం చేశారు. తాను బీజేపీకి నమ్మకమైన సైనికుడినని చెప్పుకుంటూ, పార్టీకి తాను ఎప్పుడూ ఎలాంటి హాని చేయలేదని ఎమ్మెల్యే చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే పోటీకి దూరంగా ఉంటానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం లేదని రాజాసింగ్ చెప్పారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు తాను పెద్ద అభిమానిని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా అందరీ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.
రాజా సింగ్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?
మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో ఎమ్మెల్యే సస్పెన్షన్‌కు గురయ్యారు. బీజేపీ జారీ చేసిన షోకాజ్‌కు ఆయన బదులిచ్చినప్పటికీ, ఇప్పటివరకు తన సస్పెన్షన్‌ను రద్దు చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుత సంవత్సరంలోనే జరగాల్సి ఉన్నందున, సస్పెన్షన్‌ను రద్దు చేస్తారనే నమ్మకంతో రాజా సింగ్ ఉన్నారు.
అయితే రాజా సింగ్‌కు చెందిన లోధ్ క్షత్రియ కమ్యూనిటీకి చెందిన కొంతమంది సభ్యులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడిందని మీడియా వర్గాలు తెలిపాయి. పార్టీ తమకు టికెట్ ఇస్తే గోషామహల్ నుంచి ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం ఇద్దరు సామాజికవర్గం సభ్యులు ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రాజకీయాల విషయంలో సమాజంలో ఎలాంటి గొడవలు అక్కర్లేదని బీజేపీ పెద్దలు చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
తెలంగాణలోని 199 నియోజకవర్గాలకు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారత జాతీయ కాంగ్రెస్ (INC), బీజేపీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. నిర్ణీత తేదీకి తొమ్మిది నెలల ముందు జరిగిన ఎన్నికల తర్వాత, 119 సీట్లకు గాను 88 సీట్లు గెలుచుకుని ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా ఉన్న టీఆర్‌ఎస్ తన సీట్ల వాటాను 25 పెంచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్నికలలో కాంగ్రెస్ సీట్ల వాటా 21 నుండి 19కి తగ్గింది. ఎంఐఎం ఏడు స్థానాలను గెలుచుకోగలిగింది. కాగా, ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజా సింగ్ మాత్రమే గెలుపొందారు. పార్టీ సీట్ల వాటా ఐదు నుంచి ఒకటికి పడిపోయింది.
లాతూర్‌లో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు రాజా సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది
మరోవైపు మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో రాజా సింగ్‌పై విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ కేసు నమోదైంది. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు ఒక అధికారి తెలిపారు. సోమవారం శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ సింగ్‌పై 153A (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం మరియు భాష ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) సహా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.