సోషల్ మీడియాలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు ఉంటాయి. కొందరు బతికున్న వ్యక్తి చనిపోయాడని సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆ వ్యక్తి భార్యను ఆసుపత్రి పాలు చేసింది. నిజా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కొన్ని ప్రాంతాల్లో హింసకు కారణమయ్యాయి. మరికొందరి ప్రాణాలే పోయాయి. ఏదైనా పోస్టు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని గుర్తు చేసే సంఘటన ఇది.
బతికున్న వ్యక్తి చనిపోయాడని సోషల్ మీడియా లో పోస్టింగ్ రావడంతో అది చూసిన ఆ వ్యక్తి భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో నివాసముంటున్న గణేష అనే వ్యక్తి చనిపోయినట్లుగా సోషల్ మీడియా లో పోస్టింగ్ పెట్టారు. గణేష్ ఇంట్లో లేకపోవడంతో.. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్త చూసిన అతని భార్య నిజమని నమ్మింది. తన భర్త నిజంగానే చనిపోయాడేమో అనుకొని ఒక్కసారిగా షాక్ కు గురై కింద పడిపోయింది. గణేష్ భార్యను చూసిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే గణేష్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తాను బతికుండ గానే చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ గణేష్ చెప్పుకొచ్చాడు. ఈ పని చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు గణేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.