హైదరాబాద్ లో వచ్చే వారం నుండి వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఉక్కపోత.. సాయంత్రం కాగానే చలి వాతావరణం కొనసాగుతూ ఉంది.
By Medi Samrat
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఉక్కపోత.. సాయంత్రం కాగానే చలి వాతావరణం కొనసాగుతూ ఉంది. ఈ చలికాలంలో తెలంగాణలో చలిగాలులు వీయలేదు, ఇకపై కూడా చలిగాలుల తీవ్రత ఉండే అవకాశం లేదని తెలుస్తూ ఉంది. జనవరి రెండో వారంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గిన్నట్లు అనిపించాయి అంతే! ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ జనవరిలో 14 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు చేరలేదు.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఫిబ్రవరి 2, శుక్రవారం నాడు హైదరాబాద్‌లో 32.4 ° C వద్ద పగటిపూట ఉష్ణోగ్రత నమోదైంది, రాబోయే నాలుగు రోజుల్లో 35 ° C వరకు చేరుకునే అవకాశం ఉంది. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. యూసుఫ్‌గూడలోని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ రికార్డుల ప్రకారం పగటి ఉష్ణోగ్రత 34.1°C వద్ద నమోదైంది. GHMC పరిమితుల్లోని చాలా ప్రాంతాల్లో శనివారం, ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 33°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు 17°C వద్ద ఉండాలి.. కానీ ఇప్పుడు సగటున 21.7°C నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ ఎక్కువేనని స్పష్టంగా తెలుస్తోంది.