మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూతపడనున్న షాపులు
ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి.
By Medi Samrat Published on 22 April 2024 2:13 AM GMTఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని (స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లలో బార్‌లు మినహా) బార్ అండ్ రెస్టారెంట్‌లు, వైన్ షాపులు, కళ్లు దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయబడతాయి. ఇటీవల శ్రీ రాముని శోభాయాత్ర సందర్భంగా కూడా వైన్ షాపులు మూతపడ్డాయి. వేడుకలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదిలావుంటే.. ఏప్రిల్ 23న జరిగే హనుమాన్ జయంతి ఊరేగింపు ముందుగా ప్రారంభించాలని, డీజే సిస్టమ్‌లను ఉపయోగించవద్దని, బాణాసంచా పేల్చవద్దని, బాటసారులపై వెర్మిలియన్ లేదా గులాల్ విసరవద్దని నగర పోలీసు చీఫ్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి కోరారు. ప్రజలను రెచ్చగొట్టేలా నినాదాలు, ఉపన్యాసాలు, పాటలు, బ్యానర్‌లను ఏర్పాటుచేయవద్దని సూచించారు. కర్రలు, కత్తులు, మారణాయుధాలు తీసుకెళ్లడాన్ని నిషేధించామని చెప్పారు. పోలీసుల అనుమతితో మాత్రమే డ్రోన్లను వినియోగించాలని చెప్పారు.
శనివారం బషీర్‌బాగ్‌లో హనుమాన్ జయంతి నిర్వాహకులు, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, పోలీసు, పౌర శాఖ అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా పండుగ, ఊరేగింపు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.