నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్‌లు, హోటళ్ల లైసెన్సులు రద్దు చేస్తాం.. సీపీ సజ్జనర్ హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
By - Medi Samrat |
నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ‘జీరో డ్రగ్స్’ విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శుక్రవారం ఆయన హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్‌జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
‘‘శుక్రవారం నుంచే నగరంలోని పబ్‌లు, హోటళ్లు రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించాం. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా మా నిఘా ఉంటుంది. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను నిశితంగా గమనిస్తున్నాం. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడిన వారి జాబితా సిద్ధం చేసి వారిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించాం. నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలనూ ఆరా తీస్తున్నాం’’ అని సీపీ సజ్జనర్ అన్నారు.
వేడుకల సమయపాలనపై సీపీ హెచ్చరిస్తూ.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటి లైసెన్సులను రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.
జనసమర్థ ప్రాంతాలైన మైత్రీవనం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్ సహా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పటిష్టమైన చెక్‌పోస్టులు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ వేడుకలపై కూడా నిఘా ఉంచాలని అధికారులకు చెప్పారు. నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. పోలీసులందరూ సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను పెంచాలని చెప్పారు.