బీజేపీ జెండా ఎగుర‌డం ఖాయం.. కేసీఆర్ స‌మాధానం చెప్పాలి : అమిత్ షా

Union Home Minister Amit Shah is in Hyderabad to campaign for local elections. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం

By Medi Samrat  Published on  29 Nov 2020 11:50 AM GMT
బీజేపీ జెండా ఎగుర‌డం ఖాయం.. కేసీఆర్ స‌మాధానం చెప్పాలి : అమిత్ షా

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించి మేయ‌ర్ పీఠం ద‌క్కించుకుంటుంద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్య‌క్తం చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి చివ‌రి రోజు కావ‌డంతో.. ఈ రోజు భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చిన అమిత్ షా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. గ్రేట‌ర్ ప్ర‌జ‌ల‌కు అమిత్ షా ధ‌న్య‌వాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ జెండా ఎగుర‌డం ఖాయం అని అన్నారు. ఎక్కిడికి వెళ్లినా బీజేపీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే బీజేపీ విజయం ఖాయమని తెలుస్తుందన్నారు.

సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి అవకాశం ఇస్తే అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తామని అన్నారు. ఇక కేసీఆర్ ఇంటిపక్కనే కూడా నీళ్లు నిలిచిపోయాయని తెలిపారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల తరువాత వంద రోజుల ప్లాన్ అన్నారని, ఆ ప్లాన్ ఏమైందో చెప్పాలని అన్నారు. లక్ష ఇల్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 11 వేలకు మించి ఇల్లు నిర్మించలేదని అన్నారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, గాంధీ ఉస్మానియా తరహాలో మరో నాలుగు ఆసుపత్రులను నిర్మిస్తామని చెప్పారని, కానీ, అది ఏమైందో ఇప్పటి వరకు తెలియదని అన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే రూ. 4500 కోట్లు ఇచ్చామని అమిత్ షా పేర్కొన్నారు.

టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్‌ను ఐటీ హబ్‌ కాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు.


Next Story