77 ఏళ్ల వృద్ధుడికి గుండె పోటు.. ఏకకాలంలో రెండు అరుదైన శస్త్రచికిత్సలు

Two rare surgeries on a 77-year-old man who suffered a heart attack. 77 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. అయితే

By అంజి  Published on  11 Jan 2022 9:56 AM IST
77 ఏళ్ల వృద్ధుడికి గుండె పోటు.. ఏకకాలంలో రెండు అరుదైన శస్త్రచికిత్సలు

77 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు ఏకకాలంలో రెండు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి ఆ వృద్ధుడిని ప్రాణపాయ స్థితి నుండి తప్పించారు. ఏకకాలంలో బృహద్ధమని కవాటం, పేస్‌మేకర్‌నూ వైద్యులు అమర్చారు. వృద్ధు వయస్కుడికి ఇలా రెండు కష్టతరమైన శస్త్రచికిత్సలు చేయడం అరుదైన విషయమని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంటి దగ్గర వృద్ధుడు గుండెపోటుకు గురై కళ్లు తిరిగి పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్‌ 26న ఆస్పత్రిలో చేరగా.. రోగికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు.

చివరకు రోగికి బృహద్ధమని మూసుకుపోయిందని, దీంతో గుండె కొట్టుకునే వేగం తగ్గిందని వైద్యులు గుర్తించారు. ఆ వెంటనే శస్త్రచికిత్స చేసి వాల్యువ మార్పిడి, పేస్‌మేకర్‌ పెట్టడం ఎమర్జెన్సీ అని తేల్చారు. రోగి వయస్సు 77 ఏళ్లు కావడంతో.. అతడికి ఇతర అనుబంధ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్యులు అతడికి టీఏవీఐ ప్రక్రియ చేపట్టారు. రోగి తోడలోని రక్తనాళాల ద్వారా గుండె కవాటం మార్చడం, అదే టైమ్‌లో పేస్‌మేకర్‌నూ అమర్చారు. దీంతో రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే ఇలాంటి ఆపరేషన్లు రోగికి ఒకేసారి చేయడం ఇప్పటి వరకు మన వద్ద లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story