నేడు హనుమాన్ జ‌యంతి.. శోభాయాత్ర సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్ నగరంలో జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్‌పై రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.

By Medi Samrat  Published on  23 April 2024 7:43 AM IST
నేడు హనుమాన్ జ‌యంతి.. శోభాయాత్ర సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్ నగరంలో జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్‌పై రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవెర్షన్ రూట్‌లో వెళ్లాలని సూచించారు. రేపు హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వ‌ర‌కూ కొన‌సాగుతుంది.

గౌలిగూడ రామ మందిరం నుండి మొదలై యాత్ర‌ పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచీగూడ క్రాస్ రోడ్స్ నుండి నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనకవైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, CGO టవర్స్, బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్.. అలాగే లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ దిశగా కొన‌సాగనుంది..

12 కిలోమీటర్లు మేర వరకు ఈ హనుమాన్ శోభయాత్ర జరుగుతుంద‌ని సీపీ వెల్ల‌డించారు. హనుమాన్ శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పోలీసు భద్రత, గస్తీ, సీసీ కెమెరాల కనుసన్నల్లో కొనసాగుతుందని సీపీ తెలిపారు. రాత్రి 8 గంటలకు హనుమాన్ శోభాయాత్ర ముగియనున్నట్లు వెల్ల‌డించారు.

హైదరాబాద్ లో 21 ట్రాఫిక్ డైవెర్షన్స్..

మంగ‌ళ‌వారం ఉదయం 11:30 నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవెర్షన్స్ ఫాలో అవ్వాల్సిందిగా హైదరాబాద్ సీపీ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూడళ్లలో 44 చోట్ల డైవెర్షన్ పాయింట్స్ ఉన్నట్లుగా చెప్పారు. అంతేకాకుండా హనుమాన్ జయంతి ఉన్న సందర్భంగా హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్ల‌డించారు.

Next Story