సైబర్ టవర్స్ నుంచి యశోద హాస్పిటల్స్ వరకు ఆర్వీబీ నిర్మాణం కారణంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ నుంచి జేఎన్‌టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
టోడీ కాంపౌండ్ నుండి 100 ఫీట్ జంక్షన్ మీదుగా JNTU, మూసాపేట్ వైపు వెళ్లే ట్రాఫిక్.. పర్వతనగర్ జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకొని ఖైత్లాపూర్ వంతెన మీదుగా వెళ్లాలని సూచించారు.
IKEA, సైబర్ గేట్‌వే, COD జంక్షన్ నుండి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా JNTU వైపు వెళ్లే ప్రయాణికులు నేరుగా JNTU వైపు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
JNTU వైపు సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ కింద ప్రయాణించే ట్రాఫిక్.. N-గ్రాండ్ హోటల్ వద్ద మళ్లింపు తీసుకోవాలి. N-కన్వెన్షన్ మీదుగా వెళ్లి.. జైన్ ఎన్‌క్లేవ్ వద్ద కుడివైపునకు వెళ్లి.. JNTU వైపు వెళ్లడానికి యశోద హాస్పిటల్ వెనుక రహదారిని ఉపయోగించాలి.