హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రానుండటంతో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాభవన్, బేగంపేట్, పంజాగుట్ట మీదుగా ఎన్టీఆర్ భవన్ వరకు ఏకంగా 50 కార్లు, 150 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఇక సాయంత్రం భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నగరానికి రానున్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు సిరాజ్‌కు గ్రాండ్ వెల్‌కం చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రి నుంచి, మెహదీపట్నం, ఈద్గా మైదాన్ మీదుగా ర్యాలీ కొనసాగనుంది. ఈ రెండు కార్యక్రమాలకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో వాహనదారులు వేరే మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు. సిరాజ్ కు సంబంధించి జులై 5న సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో మొదలుకానుంది. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగుతుంది. ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్‌లో రీక్రియేట్ చేయాలని సిరాజ్.. తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటీవలి T20 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున ఆడిన హైదరాబాద్‌కు చెందిన ఏకైక క్రికెటర్ మహ్మద్ సిరాజ్.