జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్క నాయకుడు కూడా ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని.. ఎన్నికల వ్యూహాలు పకడ్బందీగా ఉండాలని సూచించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాము. మనం చేసిన అభివృద్ధి పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటే మన విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు.
ఎన్నికల బాధ్యతలు తీసుకున్న నాయకులు వారి బాధ్యతలలో ఎక్కడ చిన్న నిర్లక్ష్యం చేయకుండా పని చేయాలన్నారు. ఈ వారం రోజులు చాలా కీలకమైన సమయం.. ఇంటింటి ప్రచారం, వీధులలో ప్రచారంలో మనం గ్రాస్ రూట్లో ఇంకా లోతుగా వెళ్లి ప్రచారం చేయాలన్నారు. మీరంతా చాలా అనుభవజ్ఞులైన నాయకులు.. ఓటర్లను ఎలా కాంగ్రెస్ వైపు నడపాలో మీకు బాగా తెలుసు.. గెలుపే లక్ష్యంగా, ప్రతి నాయకుడు తానే అభ్యర్థిని అన్నట్టుగా పని చేయాలన్నారు. ఫలితం మనకు అనుకూలంగా రావడం ఖాయం. మంచి మెజారిటీ కూడా రావాలన్నారు.