హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో సమాధి కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో ఆదివారం నాడు కొందరు విద్యార్థులు నడకకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వెనుక గల ఫారెస్ట్ ఏరియాలో వారికి సమాధి కనబడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుండి విద్యార్థులు వారి హాస్టళ్లకు పరుగులు పెట్టారు. ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఈసీహెచ్-1 హాస్టల్‌కు దగ్గరగా ఉన్న చెట్ల మధ్య సమాధి ఉంది. ఆ సమాధిపై తాజాగా చల్లిన పూలు కనిపించాయి. అయితే అక్కడ జంతువును పూడ్చిపెట్టి ఉండొచ్చని విద్యార్థులకు అనుమానం రేకెత్తుతోంది.
ఉస్మానియా యూనివర్సిటీలో బయటి వ్యక్తులు లోపలికి రాకుండా సెక్యూరిటీ గార్డ్‌తో ప్రత్యేక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఓవైపు అధికారులు చెబుతుంటే.. మరో వైపు ఇలాంటి ఘటనలతో విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని ఉస్మానియా యూనివర్సిటీ భద్రత అధికారి తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. నిజాం కాలం నుండి ఎంతో మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతూ వస్తున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని విద్యార్థులు అంటున్నారు. ఈ యూనివర్సిటీలో తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తుంటారు.