గోషామహల్ నుంచి పోటీ.. స్పందించిన రాహుల్ సిప్లిగంజ్
రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇటీవల పలు పుకార్లు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Aug 2023 10:25 AM GMTరాహుల్ సిప్లిగంజ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇటీవల పలు పుకార్లు వచ్చాయి. అతడు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నాడని.. హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగబోతున్నాడంటూ ప్రచారం సాగింది. ఈ ఊహాగానాల మధ్య, రాహుల్ సిప్లిగంజ్ తన వైఖరిని స్పష్టం చేశాడు. గోషామహల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నాడు రాహుల్ సిప్లిగంజ్.
సోషల్ మీడియా ద్వారా ఈ వాదనలలో నిజం లేదని స్పష్టం చేశాడు. “పుకార్లు ఉండడం సహజమే, కానీ ఈ పుకారు చాలా దూరం వెళ్ళింది. దయచేసి దీన్ని చదవండి🙏🏻" అని రాహుల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నేను ఏ రాజకీయాల్లోనూ లేనని, గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చాలా పుకార్లు వచ్చాయి. అవన్నీ గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఫేక్ న్యూస్. అది అస్సలు నిజం కాదు. నేను అన్ని పార్టీలకు చెందిన నాయకులందరినీ గౌరవిస్తాను ఎందుకంటే నేను ఒక కళాకారుడిని. నేను అందరినీ అలరించాలి.. ఇది నేను నా జీవితాంతం చేస్తానని తెలిపాడు.
హైదరాబాద్ పాతబస్తీ నుండి వచ్చిన రాహుల్ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తన తండ్రితో కలిసి బార్బర్‌గా పనిచేస్తూనే, అతను ప్రైవేట్ ఆల్బమ్‌ల రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా సూపర్ హిట్ పాటలు పాడాడు. "RRR" చిత్రంలో "నాటు నాటు" పాటకు అతనికి మంచి గుర్తింపు వచ్చింది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులతో రాహుల్ సిప్లిగంజ్ కు అనుబంధాలు ఉన్నాయి. అతను తరచుగా రాజకీయ నాయకులు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నాడు. వివిధ పార్టీల ప్రతినిధులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాడు.