Hyderabad: ట్రాప్‌ చేసి.. బాలికపై కానిస్టేబుల్‌ పలుమార్లు అత్యాచారం.. వీడియోలు తీసి..

కానిస్టేబుల్ ప్రదీప్ కన్ను ఓ మైనర్ బాలికపై పడింది. బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్‌కు పంపించాడు.

By అంజి  Published on  27 Jun 2024 3:00 PM IST
constable, arrest, Crime, Hyderabad

Hyderabad: ట్రాప్‌ చేసి.. బాలికపై కానిస్టేబుల్‌ పలుమార్లు అత్యాచారం.. వీడియోలు తీసి.. 

ఆపద వస్తే చాలు ఖాకీ యూనిఫామ్‌ను ఆశ్రయిస్తాం. అదే ఖాకీ యూనిఫామ్ కీచకుడిగా మారి వెంటపడితే.. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో నగరంలో కీచక పోలీసుల కథనాలు వరుసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే మరొకటి రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రదీప్ అనే వ్యక్తి పోలీస్ శాఖలో 2020 బ్యాచ్‌కు చెందినవాడు. రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్‌పల్లిలో కానిస్టేబుల్ గా పనిచేసిన ప్రదీప్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకొని వారిని బెదిరించి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని వాడుకునే వాడు ఈ కానిస్టేబుల్‌.. ఖాకీ యూనిఫామ్ ను అడ్డం పెట్టుకొని అమాయకులైన మైనర్ బాలికలను వశపరచుకునేవాడు.

మైనర్ అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారి వ్యక్తిగత ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. తనతో పడుకోకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు గురి చేసేవాడు. ఇది అతని నైజం.. ఇటీవల కానిస్టేబుల్ ప్రదీప్ కన్ను ఓ మైనర్ బాలికపై పడింది. బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్‌కు పంపించాడు ఈ కామాంధుడు.. అవి చూసిన బాలిక ఒక్కసారిగా షాక్ అయ్యింది. తాను పిలిచినప్పుడు తనతో గడపాలని లేకపోతే ఈ వీడియోలు బయట పెడతానంటూ కీచక కానిస్టేబుల్ ప్రదీప్ మైనర్ బాలికకు వార్నింగ్ ఇచ్చాడు. చేసేదేమీ లేక మైనర్ బాలిక అతనికి లొంగిపోయింది. ఆ విధంగా అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసి గత రెండు సంవత్సరాల నుండి ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు.

అంతే కాదండోయ్ ఈ కీచక కానిస్టేబుల్ మైనర్ బాలిక గర్భం దాల్చకుండా పసరు పోయించాడు. రోజు రోజుకి కానిస్టేబుల్ ప్రదీప్ ఆగడాలు మితిమీరి పోతూ ఉండడంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో మైనర్ బాలికతో కలిసి తల్లిదండ్రులు నిన్న సైబరాబాద్ కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లారు. అది తెలుసుకున్న వెంటనే కానిస్టేబుల్ ప్రదీప్ తన మీద ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బాలిక కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు షీ టీం సహాయంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ ప్రదీప్ ఫోను తీసుకొని పరిశీలించగా ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉండడం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ కామాంధుడు పనిచేసే పోలీస్ స్టేషన్ లో కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడని తెలింది. ప్రదీప్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి వెంటనే ప్రదీప్ ను సస్పెండ్ చేశారు.

Next Story